కరీంనగర్ జిల్లా: రైతుల కష్టాలు సీఎంకేసీఆర్కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. జమ్మికుంట పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ అండతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రూ.68 లక్షలు వెచ్చించి పాత మార్కెట్లో నూతన కార్యాలయ భవనం, మరో రూ.68 లక్షలతో వావిలాల మార్కెట్ ప్రహరీ నిర్మించబోతున్నామని, 9 నెలల్లోపే నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఒక రైతే రాష్ట్రానికి సీఎంగా ఉండటం రైతులు గర్వపడే విషయమని చెప్పారు. రైతుల కష్టాలు కేసీఆర్ కు తెలుసు కాబట్టే రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు అమలుచేస్తున్నరని పేర్కొన్నారు. తాజాగా సన్న వడ్లకు క్వింటాల్ కు రూ.2500 మద్దతు ధరను ప్రకటించిన కేసీఆర్ కు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కౌషిక్ రెడ్డి.. 30 శాతం తేమ ఉన్నా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.