జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా అభివృద్ధికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆయన తమ్ముడు దేవేందర్ రెడ్డి అడ్డుపడ్డారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గతంలో జగిత్యాల ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ఉన్నా ఏనాడు గ్రామాలను పట్టించుకోలేదని ఆరోపించారు. గతంలో ఎన్నికల ముందు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారని, గెలిచిన తర్వాత వాటిని విస్మరించారని మండిపడ్డారు. బోర్నపల్లి వంతెన కట్టిస్తామని చెప్పి రెండు సార్లు గెలిచిన తర్వాత నిర్మించలేదని, అధికారంలోకి వచ్చిన తర్వాత తామే కట్టించామని చెప్పారు. జగిత్యాలను జిల్లా చేశామని, మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేశామన్నారు. తమ అధినేత ఏనాడు జనాలకు ముఖం చాటేయలేదన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ మునుగోడుకు మొహం చాటేశారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత ఈ కామెంట్స్ చేశారు.
యువత మద్దతుతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ 60 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన నాయకుడు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ జగిత్యాలలో మరోసారి రికార్డు బద్దలు కొట్టాలన్నారు. జగిత్యాల నుండే జైత్రయాత్ర మొదలు పెడుదామన్నారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో వరిసాగు రెట్టింపు అయ్యిందన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ ప్రతినెలా కేసీఆర్ ప్రభుత్వమే ఇస్తోందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయంలో ఎవరైనా చనిపోతే మరొకరికి ఫించన్ వచ్చేదని, కానీ ఇప్పుడు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చామని, తెలంగాణ మాదిరిగా దేశాన్ని బంగారు తెలంగాణ చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను టీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి వివరించాలన్నారు. సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వంపై చేసే మోసపూరిత ప్రకటనలను తిప్పి కొట్టాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు.