ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులే తమ ఇంటికి రావచ్చని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఒక వేళ ఈడీ ఇంటికి రానంటే తానే ఈడీ అధికారులు ఎదుట హాజరవుతానని చెప్పారు. ఇలాంటి కేసుల్లో మహిళలను ఇంట్లోనే విచారిస్తారని గుర్తు చేశారు. కుదరక పోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా విచారిస్తారని తెలిపారు. కానీ కావాలనే తనను ఢిల్లీకి పిలిచారని..2023, మార్చి11వ తేదీన ఉదయం 11న ఈడీ విచారణకు హాజరవుతానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టేందుకే ఈడీని ప్రయోగిస్తోందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.
మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుంది..
ఈ ఏడాది చివరి వరకు తెలంగాణలో ఎన్నికలున్నాయని..అందుకే ప్రధాని మోడీ తమను టార్గెట్ చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉన్నా మోడీ వచ్చే ముందు ఈడీ రావడం కామన్ అని చెప్పారు. అందుకే తమను భయపెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం ఈడీని తమపై ప్రయోగించిందన్నారు. తనను మాత్రమే కాదు..తనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలు సహా 15 మందిని బీజేపీ ప్రభుత్వం విచారణ పేరుతో వేధిస్తోందన్నారు.
డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోంది..
దేశంలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇందులో ఓ ఇంజన్ ప్రధాని మోడీ అయితే... మరో ఇంజన్ అదానీ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంలో శ్రద్ధ చూపెడుతున్న మోడీ..దేశంలో సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. గాంధీజీ పుట్టిన దేశంలో ప్రస్తుతం అబద్దాలు రాజ్యమేలుతున్నాయని చెప్పారు. మోడీ ఎంత భయపెట్టినా..భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్ని కేసులు పెట్టినా..పోరాటం చేస్తామని..న్యాయ వ్యవస్థపై నమ్మకముందున్నారు.