ఒక్క పసుపు బోర్డు ఏర్పాటుతో అన్నీ మారిపోవు :ఎమ్మెల్సీ కవిత

ఒక్క పసుపు బోర్డు ఏర్పాటుతో అన్నీ మారిపోవు :ఎమ్మెల్సీ కవిత
  •   క్వింటాల్​కు రూ.15 వేలు ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, వెలుగు : సంక్రాంతి గిఫ్ట్​గా పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే.. దానిని బీజేపీ కార్యక్రమంగా నిర్వహించడాన్ని ఆక్షేపిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రొటోకాల్​ను పక్కనపెట్టి జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు రాకేశ్​రెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ సమక్షంలో బోర్డును ప్రారంభించడం కరెక్టు​కాదన్నారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలందరినీ పిలవాల్సిందన్నారు. ఆదివారం నిజామాబాద్ లో  బీఆర్ఎస్​ ఆఫీసులో మీడియాతో  కవిత మాట్లాడారు. ఒక్క పసుపు బోర్డు ఏర్పాటుతో అన్నీ మారిపోవన్నారు. విదేశాల నుంచి పసుపు దిగుమతిని తగ్గించుకోవాలని, అవసరమైతే పూర్తిగా రద్దు చేసుకోవాలన్నారు.

క్వింటాల్  పసుపునకు రూ.15 వేల గిట్టుబాటు ధర ఇవ్వాలని ఆమె డిమాండ్  చేశారు. తాను ఎంపీగా గెలిచిన తరువాత పసుపు బోర్డు కోసం అలుపెరుగని పోరాటం చేశానని చెప్పారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడమే కాకుండా పార్లమెంట్​లో అనేక సార్లు ఈ అంశంపై మాట్లాడి ప్రైవేట్​ మెంబర్​ బిల్లును ప్రవేశపెట్టానని పేర్కొన్నారు. ఆ టైంలో ఇప్పటి ఎంపీ అర్వింద్​ పాలిటిక్స్​లోనే లేరని తెలిపారు. ‘‘2019 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికైన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని అర్వింద్  బాండ్​పేపర్​ రాసిచ్చి స్పైస్​ బోర్డుతో సర్దుకోమని చెప్పారు. పసుపు బోర్డు కంటే స్పైస్​ బోర్డే ఎక్కువన్నట్లు మాట్లాడారు. మరిప్పుడు పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేశారు?” అని కవిత నిలదీశారు.