
కొమురవెల్లి, వెలుగు: బీసీ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం హర్షణీయమని, బిల్లు అమలయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. శనివారం కొమురవెల్లి మల్లన్నకు బోనాలు సమర్పించి, పట్నాలు వేసి గర్భగుడిలో మల్లికార్జునస్వామిని దర్చించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీసీ బిల్లు ఆమోదం పొందడంతో మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ డిమాండ్ కు ప్రభుత్వం తలొగ్గి బీసీ రిజర్వేషన్ బిల్లులు చేసిందని చెప్పారు.
చట్టాలను కేంద్రం ఆమోదించేలా ప్రభుత్వం తనవంతు ప్రయత్నం చేయాలని, కోర్టుల్లో సవాలు చేస్తే ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలన్నారు. దేశంలో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్రాలు తెలంగాణతో సహా 10 ఉన్నాయన్నారు. ఈడబ్ల్యూస్ రిజర్వేషన్లు అమలైన తరువాత తెలంగాణలో 54 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని తెలిపారు. రాజకీయ, విద్య, ఉద్యోగరంగాలకు కలిపి ఒకే బిల్లుపెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని తొలి నుంచి వాదిస్తున్నామని చెప్పారు.
కొమురవెల్లి మలన్నకు ప్రభుత్వం తరపున మాజీ సీఎం కేసీఆర్ 130 ఎకరాల మాన్యం భూమిని అందజేశారని, ఆయన హయాంలోనే కొమురవెల్లి టెంపుల్ అభివృద్ధి జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పబ్బోజు విజేందర్, కొట్టాల యాదగిరి, మహేందర్, కుమారస్వామి పాల్గొన్నారు