
బషీర్బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెంచబోయే రిజర్వేషన్లను సత్వరమే అమలు చేయించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి ప్రభుత్వం రెండు వేర్వేరు బిల్లులు పెట్టడం తెలంగాణ జాగృతి సాధించిన విజయమన్నారు. లక్డీకాపూల్ లో సోమవారం నిర్వహించిన తెలంగాణ ప్రజా కవులు, కళాకారులు వేదిక ఆవిర్భావ సభకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కలిపి చరిత్ర సృష్టించాయన్నారు. సామాజిక తెలంగాణ వైపు ప్రయాణం కొనసాగించాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో కీలకమని, ఉద్యమాల్లో పాటలు, రచనలు క్రియాశీలక పాత్ర పోషించాయని అన్నారు. పాట చైతన్యానికి ప్రతీక అని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ కళాకారులు గళమెత్తాలని పిలుపునిచ్చారు.