- నేనూ తెలంగాణ ఆడబిడ్డనే కదా
- సింగరేణిలో 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలిచ్చాం
- టీఎస్‌పీఎస్సీలో ఆంధ్రా వ్యక్తి సభ్యుడా..
- తెలంగాణ అసెంబ్లీకి ఏపీ అడ్వైజర్ ఎందుకు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహం తనలా ఉందని సీఎం అంటున్నారని, అలా ఉంటే తప్పేంటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తానూ తెలంగాణ ఆడబిడ్డనే కదా అని ప్రశ్నించారు. అయినా తెలంగాణ తల్లి విగ్రహం గురించి సీఎం మాట్లాడటం ఏంటన్నారు. సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్క వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టిందే కాంగ్రెస్ అని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలిచ్చామన్నారు. జీఎం స్థాయిలో చేయాల్సిన పనిని సీఎం చేస్తున్నారని విమర్శించారు.
కొత్తగా 400 ఉద్యోగాలు ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తాము ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారని వెల్లడించారు. సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు బీఆర్‌ఎస్ సర్కార్ ప్రయత్నించిందని స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో సింగరేణి ఉద్యోగాల్లో కోత విధించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదన్నారు. రాష్ట్ర గీతం గురించి సీఎం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్ ఒక్కసారి కూడా చెయ్యెత్తి జై తెలంగాణ అనలేదన్నారు.
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి తక్షణమే తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయమై త్వరలో గవర్నర్‌ను కలుస్తామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీలో ఆంధ్రా వ్యక్తిని సభ్యుడిగా నియమించారని ఆరోపించారు. రాజకీయ నేపథ్యం ఉన్న పాల్వాయి రజనిని మెంబర్‌గా ఎలా నియమిస్తారన్నారు. రాష్ట్రంలో కరెంటు కోతలు మొదలయ్యాయని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీకి ఏపీ అడ్వైజర్ ఎందుకని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తరఫున ఓటుకు నోటు కేసును వాదించిన లాయర్లకు ప్రభుత్వం తరఫున జీతాలిస్తున్నారని చెప్పారు.