కాంగ్రెసోళ్లు మారరా ఇక..? అప్ డేట్ కారా ?

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అప్ డేట్స్  లేని  ఔట్ డేటెడ్ నాయకుడని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రాహుల్ గాంధీకి ఆలోచన లేదని..ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ వేగాన్ని అందుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ప్రధాని మోదీని రాహుల్ గాంధీ అడ్డుకోలేకపోతున్నారు కాబట్టే..జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అయ్యిందని స్పష్టం చేశారు.  జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆమె..కాంగ్రెస్ అంటే అవినీతి.. ఆ పార్టీని దేశం రిజెక్ట్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ లో క్రియేటివిటి..కమిట్‌మెంట్ లేదన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్‌ఎస్‌ పథకాలను కాపీ కొడుతూ డిక్లరేషన్‌లు ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. 

Also Read :- మైనంపల్లి అనుచరులు వర్సెస్ బీజేవైఎం కార్యకర్తలు పొట్టు పొట్టు కొట్టుకున్నరు

కాంగ్రెస్ తీరు గమ్మతి..

కాంగ్రెస్ పార్టీ తీరు గమ్మతిగా ఉంటుందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. తెలంగాణకు వచ్చిన  రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే  పోడు పట్టాలు ఇస్తామంటున్నారని...  వీళ్లు మారరా.? అప్ డేట్ కారా ? ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని పోడు పట్టాలు ఇచ్చేసిందని గుర్తు చేశారు. మళ్లీ  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పోడు పట్టాలు ఇస్తారటా....అని విమ‌ర్శించారు. దళితులకు మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్.. దళిత డిక్లరేషన్ లో ఎక్కడైనా పెట్టారా అని ప్రశ్నించారు. 

చిత్త శుద్ది లేదు..

తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు కింద రూ. 10 లక్షలు ఇస్తుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ. 12 లక్షలు ఇస్తారట.. కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి ఇస్తే..దానికి మరోటి ఎక్కువ ఇస్తామనడం తప్ప..కాంగ్రెస్ కు కొత్త పథకం గురించి ఆలోచనే లేదన్నారు. తెలంగాణలో డిక్లరేషన్ల పేరిట ఇస్తున్న హామీలను.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇచ్చారా  అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ కు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఆ పార్టీ అవినీతిలో కూరుకుపోయినందుకు అందుకే  దేశవ్యాప్తంగా తిరస్కరణకు గురయ్యిందని ఎద్దేవా చేశారు.