ఆదివాసీ గూడేలు ఆగమైనయ్..ఇచ్చిన హామీలు అమలు చేయాలి: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆదివాసీ గూడేలు ఆగమయ్యాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. హామీలు, ప్రకటనలకే ప్రభుత్వం పరిమితం కాకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం ఓ ప్రకటనలో ఆమె డిమాండ్ చేశారు. ‘‘ఇటీవల నేను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాధవ్​తో కలిసి బోథ్, ఆసిఫాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోని ఆదివాసీ గూడేలకు వెళ్లాను. వాళ్లు పడుతున్న కష్టాలు స్వయంగా చూశా. ఆదివాసీలు అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నరు.

తాగునీటి సరఫరా వ్యవస్థ పాడైపోయింది. అయినా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆదివాసీల విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి. సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నరు. వారికి టైంకు మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది’’అని కవిత విమర్శించారు. ఆదివాసీల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు.