మిర్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ కవిత 

మిర్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ కవిత 
  • ఏపీ సీఎం చంద్రబాబు రైతుల కోసం ఢిల్లీలో లొల్లి చేస్తుండు
  • తెలంగాణ సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాత్రం గల్లీల్లో తిరుగుతూ రాజకీయాలు చేస్తుండు
  • ఎమ్మెల్సీ కవిత విమర్శ

మహబూబాబాద్, వెలుగు : మిర్చి రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ పట్టణంలోని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌లో సోమవారం మీడియాతో మాట్లాడారు. ఏపీ రైతుల కోసం అక్కడి సీఎం చంద్రబాబు ఢిల్లీలో లొల్లి చేసి మద్దతు ధర సాధించే ప్రయత్నం చేస్తే, తెలంగాణ సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి మాత్రం రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఎమ్మెల్సీ ఓట్ల కోసం తిరుగుతున్నారని మండిపడ్డారు.

మిర్చి క్వింటాల్‌‌‌‌కు రూ. 25 వేలు చెల్లించాలని డిమాండ్‌‌‌‌ చేశారు. మిర్చికి గిట్టుబాటు ధర అందక కురవి మండలం తుల్చాతండాకు చెందిన బాలకిషన్‌‌‌‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్‌‌‌‌లో 8 మంది కార్మికులు చిక్కుకున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. ఆయనకు కేసీఆర్‌‌‌‌ ఫోబియా, పాలిటిక్స్‌‌‌‌ మినహా మిగతా సమస్యలేవీ పట్టడం లేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రచారం చేసి కాల్వల ద్వారా సాగునీరు ఇవ్వకుండా రైతుల పొలాలను ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా సక్రమంగా అమలు కావడం లేదని, సన్నొడ్లకు బోనస్‌‌‌‌ బోగస్‌‌‌‌గా మారిందన్నారు. మానుకోటకు రేవంత్‌‌‌‌రెడ్డి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదన్నారు. మానుకోట అభివృద్ధి కోసం మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ కేటాయించిన రూ.300 కోట్ల ఎస్‌‌‌‌డీఎఫ్‌‌‌‌ నిధులను కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమన్నారు.

అనంతరం కేసముద్రం అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో పర్యటించి రేట్లను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌‌‌‌గా పోటీచేసిన బీసీ క్యాండిడేట్లకు బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మద్దతు పలుకుతుందని ప్రకటించారు. ఆమె వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, సత్యవతి రాథోడ్, డీఎస్‌‌‌‌ రెడ్యానాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ టి. రవీందర్‌‌‌‌రావు, మాజీ ఎమ్మెల్యేలు బానోత్‌‌‌‌ శంకర్‌‌‌‌నాయక్‌‌‌‌, చంద్రావతి పాల్గొన్నారు.