బయ్యారంలో స్టీల్​ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిందే :ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

  • సాధ్యం కాదని కిషన్​ రెడ్డి ప్రకటించడం దారుణం: కవిత

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్​ చేశారు. స్టీల్​ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. స్టీల్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని పార్లమెంట్​లో కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ప్రకటించడం బాధాకరమని గురువారం ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా దీనిపై స్పందించకపోవడం దారుణమన్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి గతంలో ఎంపీగా ఉన్న సమయంలో ఉక్కు పరిశ్రమ కోసం డిమాండ్ చేశారని.. కానీ, ఇప్పుడు మాత్రం మాట్లాడడం లేదని విమర్శించారు. బయ్యారం స్టీల్​ ప్లాంట్​ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందని, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాన్ని అమలు చేయాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అంటూ 2013లోనే అప్పటి ప్రధాని మన్మోహన్​ సింగ్​కు కేసీఆర్​ లేఖ రాశారన్నారు. అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేస్తే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది కేసీఆర్​ ఆలోచన అని చెప్పారు.

కాగా, కవితను సగర, వంశరాజుల సంఘాల నాయకులు గురువారం ఆమె నివాసంలో కలిశారు. తమకు ప్రభుత్వం ఆరోగ్య రక్షణ కల్పించేలా అసెంబ్లీలో పోరాడాలని సగర సంఘం అధ్యక్షుడు విజయేందర్​ సాగర్​ కోరారు. బీసీ డీలో ఉన్న తమను బీసీ ఏలోకి మార్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. సంచార జాతులుగా ఉన్న వంశరాజులు ఆర్థిక, రాజకీయ, విద్య, సామాజిక రంగాల్లో వెనుకబడ్డారని, దీనిపై అసెంబ్లీలో ప్రశ్నించాలని కవితను ఆ సంఘం అధ్యక్షుడు మురళి కోరారు. అలాగే, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఈ నెల 14న సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో జాగృతి ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్​ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు.