
- విద్యార్థుల్లో ఉన్న అనుమానాలను తీర్చండి: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 పరీక్షలు, ఫలితాలపై అభ్యర్థులు లేవనెత్తుతున్న అనుమానాలను ప్రభుత్వం, టీజీపీఎస్సీ నివృత్తి చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, 3 పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఆదివారం 11 యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కవిత ఆమె నివాసంలో సమావేశమయ్యారు. పేపర్ల మూల్యాంకనంలో తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయ జరిగిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారని వెల్లడించారు.
ట్రాన్స్‌లేషన్ సమస్యతో ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు సరిగ్గా మూల్యాంకనం చేయలేకపోయారని, దీంతో మార్కుల్లో తేడాలు వచ్చాయని స్టూడెంట్లు ఆందోళన చెందుతున్నారన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో ప్రిలిమ్స్‌కు ఒక హాల్ టికెట్ నంబర్, మెయిన్స్‌కు మరో హాల్ టికెట్ నంబర్‌ను కేటాయించడంపై విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.కాగా, తెలంగాణ భాష గర్వకారణమని, ముందు తరాలకు ఆ భాషను అందించడమే అందరి ధ్యేయం కావాలన్నారు. తెలంగాణ భాషలో కవితలు, కథల పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను కవిత ఆవిష్కరించారు. కవితలు, కథలు రాసి మే 30లోపు haridaasaraswathiraj@gmail.comకు పంపాలని ఆమె సూచించారు.