
- 11లోగా అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం పెట్టాల్సిందే: ఎమ్మెల్సీ కవిత
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అనుముల ఇంటెలిజెన్స్(ఏఐ) విధ్వంసం సృష్టిస్తున్నదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఆ ఇంటెలిజెన్స్ ను పక్కకు జరిపితే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు. ప్రజలను మోసం చేయడమే అనుముల ఇంటెలిజెన్స్ ముఖ్య ఉద్దేశమని ఆరోపించారు. అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం ఆమె ఇందిరా పార్క్ ధర్నాచౌక్ లో దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దేశంలోని వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని ఆకాంక్షించిన వ్యక్తి జ్యోతిబా ఫూలే అని తెలిపారు.
ఈ నెల11లోగా అసెంబ్లీ ఆవరణలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూలే విగ్రహంతో సమాజం స్ఫూర్తి పొందుతుందని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామన్నారు. బీసీ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. ఆ బిల్లులను ఆమోదించడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. బీసీ బిల్లు విషయంపై అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరసన తెలియజేస్తామని కవిత పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, జయసింహ, కార్పొరేటర్ శ్యామల హేమ, ఎల్చల దత్తాత్రేయ, జంగయ్య, కరాటే రాజు తదితరులు పాల్గొన్నారు.