- పదేండ్ల పవర్లో ఉండి విభజన చట్టాన్ని పక్కన పెట్టడం సరికాదు
- బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్
హైదరాబాద్: రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఒక్కరు కూడా బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం మాట్లాడకపోవటం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బయ్యా రం ఉక్కు-తెలంగాణ హక్కు అంటూ తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేస్తున్నామన్నారు.
‘ 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కేసీఆర్ లేఖ రాశారు. బయ్యారంలో లక్షా 41 వేలకు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నులకుపైగా ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయని కేంద్రానికి నివేదించారు.
అక్కడ ఉక్కు పరిశ్రమ వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు పెరుగుతాయి అన్నది కేసీఆర్ ఆలోచన. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టాన్ని మాత్రం అమలు చేయాల్సిందే.
కేంద్రంలో పదేండ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ హామీని అమలు చేయడం లేదు. ఐరన్ ఓర్ నాణ్యత నేపథ్యంలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని బీజేపీ ప్రభుత్వం సాకు చూపిడం కరెక్ట్కాదు. బీజేపీకి తెలంగాణ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి, ప్రేమ ఉన్నా తక్షణమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలి’ అని కవిత ట్వీట్చేశారు.