
సూర్యాపేట: ఢిల్లీ వెళ్లడం.. కేసీఆర్‌ని తిట్టడం తప్ప రేవంత్ పాలనలో చేసేందేమి లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మంగళవారం (ఫిబ్రవరి 18) సూర్యాపేట జిల్లాలో జరుగుతోన్న పెద్దగట్టు జాతరకు ఎమ్మెల్సీ కవిత వెళ్లారు. దర్శనం అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. లోక్ సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిన రోజే పెద్దగట్టు జాతరకు రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణా ఏర్పడ్డాక సూర్యాపేట జిల్లాగా మారిందని.. కేసీఆర్ చొరవతో జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చిందని అన్నారు. తెలంగాణ ఫలాలు ప్రజలకు అందాయనడానికి ఇవే రుజువు అన్నారు.
రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి కుంట పడిందని.. కనీసం మహిళల సంక్షేమం కోసం ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. మహిళల అభివృద్ధిపై చర్చకు రావాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ఆడబిడ్డలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని.. మహిళలపై 20 శాతం క్రైమ్ పెరిగిందని విమర్శించారు.
రాష్ట్రంలో మతకల్లోలాలు కూడా బాగా పెరిగాయన్నారు. కొట్లాడి తెచ్చిన తెలంగాణను కాపాడుకునే పరిస్థితి లేదన్నారు. ఎస్సీల కోసం సీఎం రేవంత్ ఏం చేశారని ప్రశ్నించారు. కులగణతో గందరగోళం సృష్టించి జనాభా లెక్కలు తక్కువ చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. కాళేశ్వరం నీళ్ళు సూర్యాపేట జిల్లా వరకు తెచ్చామని.. ఇప్పుడు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు నీళ్ళు ఇస్తలేరని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన నీటి విధానం లేదని.. కాళేశ్వరం డ్యామ్ బాగానే ఉన్నా కావాలని నీళ్ళు ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు లేక పంటలు ఎండుతున్నాయని.. రైతుల ఉసురు కాంగ్రెస్‌కి తప్పక తాకుతుందన్నారు. జిల్లా మంత్రి ఉత్తమ్‌కి సాగు నీరు అందించడంలో శ్రద్ధ లేదన్నారు. కేసీఆర్‌ను తిడితే ఏమీ ఓరగదని.. ఇకనైనా ఆయనపై విమర్శలు చేయడం మాని సంక్షేమంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.