బండీ.. ఏంటా వ్యాఖ్యలు .. నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

బండీ.. ఏంటా వ్యాఖ్యలు .. నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
  • రాష్ట్రంలో ఇండ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని అంటవా?

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్  ప్రకటించడం ఫెడరల్  స్ఫూర్తికి  విఘాతమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడమేనని ఆమె మండిపడ్డారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్  బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ లో రాజ్యాంగ పరిరక్షణపై తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన సెమినార్ లో కవిత పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, హక్కలను కాపాడడం, పరిపాలనలో పారదర్శకతను పాటించడం, ఆదేశిక సూత్రాలను సమర్థంగా అమలు చేయడం వంటి మొత్తం 19 తీర్మానాలను సెమినార్ లో ఆమోదించారు. 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ...  బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోమని సంజయ్  మాట్లాడుతున్నారని , రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లని ప్రశ్నించారు. సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ప్రకటించారు. ఇక, పాకెట్  డైరీలా రాహుల్  గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలని  అంటున్నారని, ముందు తెలంగాణలో రాజ్యాంగాన్ని కాపాడాలని కవిత హితవు పలికారు.