
మహబూబాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే అర్హత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లేదని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ పేర్కొన్నారు. మిర్చికి మద్దతు ధర అడిగితే ఖమ్మం జిల్లాలో రైతులకు సంకెళ్ల వేసి జైలుకు పంపిన ఘన చరిత్ర బీఆర్ఎస్ దేనన్నారు. రైతులకు ఇచ్చిన హమీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు. రైతు భరోసాను ఎకరానికి రూ.6 వేలు అందిస్తున్నామని తెలిపారు. దీనిని ఓర్వలేక అనవసర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
లిక్కర్ స్కాం కారణంగానే ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కూలిపోయిందన్నారు. జైలు జీవితం గడిపిన కవిత మానుకోటలో ఏ ముఖం పెట్టుకుని తిరుగుతున్నారని ప్రశ్నించారు. జిల్లాలో వరదలు వచ్చిన సమయంలో కేసీఆర్జిల్లాకు ఎందుకు రాలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని, కాంగ్రెస్ పాలనలో ప్రజా సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. మానుకోట ప్రజలు బీఆర్ఎస్ కపట రాజకీయాలను నమ్మవద్దని కోరారు.