అయ్యప్ప భక్తుల ధర్నా, రాస్తారోకో
అయ్యప్ప జన్మ వృత్తాంతం, భక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వరంగల్ జిల్లాకు చెందిన బైరి నరేశ్ ను కఠినంగా శిక్షించాలని ఉమ్మడి కరీంనగర్జిల్లాలోని అయ్యప్ప భక్తులు శుక్రవారం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నరేశ్ వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కరీంనగర్ పట్టణంలోని అయ్యప్ప సేవా సమితి బాధ్యులు సీపీ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. కోరుట్ల, కథలాపూర్ పోలీస్స్టేషన్లలో, తిమ్మాపూర్ అయ్యప్ప సేవాసమితి సభ్యులు ఎల్ఎండీ ఎస్ఐ ప్రమోద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మెట్ పల్లి లో ఎన్ హెచ్ 63పై అయ్యప్ప స్వాములు ధర్నా చేశారు. చొప్పదండి, రామడుగులో అయ్యప్పలు రాస్తారోకో చేశారు. ముస్తాబాద్ లో అయ్యప్ప స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో నరేశ్ దిష్టి బొమ్మను దహనం చేశారు. - వెలుగు, నెట్వర్క్
డాక్టర్లు సమయపాలన పాటించాలి : జెడ్పీ చైర్ పర్సన్ అరుణ
సిరిసిల్ల టౌన్, వెలుగు: జిల్లా ఆస్పత్రికి వచ్చే పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని హాస్పిటల్ డెవలప్ మెంట్ కమిటీ చైర్మన్, జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ ఆదేశించారు. శుక్రవారం ఆమె ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడాతూ వైద్యులు సమయపాలన పాటించి, రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. కరోనాపై వైద్యులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం వైద్యులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట సూపరింటెండెంట్ మురళీధర్ రావు, ఆర్ఎంఓ నాగరాజు, డాక్టర్లు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు త్వరగా చేయండి
మంత్రిని కోరిన ఎమ్మెల్యే చందర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని ఎమ్మెల్యే కలిశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో కుక్కలగూడూర్ బుగ్గ ఒర్రె మునిగిపోవడంతో పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని, హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
శివరాత్రి జాతరను సక్సెస్ చేద్దాం
వేములవాడ, వెలుగు: ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీ వరకు జరిగే మహా శివరాత్రి జాతరను పకడ్బందీ ప్లానింగ్ తో సక్సెస్చేద్దామని కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ రాహుల్ హెగ్డే అధికారులకు సూచించారు. శివరాత్రి జాతర ఏర్పాట్లపై శుక్రవారం రాజన్న ఆలయం ఓపెన్ స్లాబ్‌లో అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు సేవ చేయడం అధికారులు బాధ్యతగా తీసుకోవాలని, అప్పుడే నిజమైన సేవలు అందుతాయని అన్నారు. గతం కంటే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందన్నారు. జాతరలో ట్రాన్స్పోర్ట్, పార్కింగ్, రోడ్ల మరమ్మతులు, అకామిడేషన్, తాగునీరు, విద్యుత్ సరఫరా, బందోబస్తు, పార్కింగ్, క్రౌడ్, క్యూ లైన్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పారిశుధ్యం ప్రాధాన్యతను గుర్తించి మ్యాన్ పవర్, వాహనాలను పెంచుకోవాలని చెప్పారు. ఎక్కువగా టాయిలెట్, డ్రెస్ ఛేంజింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని, యాత్రీకుల రద్దీని బట్టి ఆర్టీసీ అధికారులు అదనపు బస్ లు నడుపాలని అధికారులను ఆదేశించారు. టెంపుల్ కి వచ్చే రోడ్లే కాకుండా పట్టణంలోని అన్ని ప్రధాన రోడ్లను పరిశీలించి అవసరమున్న చోట మరమ్మతు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం..
మహా శివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. జాతరకు జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల పోలీసులు కూడా బందోబస్తు చేస్తారన్నారు. భక్తులకు ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తామని, పార్కింగ్, క్యూ లైన్, ధర్మగుండం కంట్రోల్ రూమ్, బ్యారికెడింగ్ మేనేజ్మెంట్ ను పకడ్బందీ గా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, ఆలయ ఈఓ కృష్ణ ప్రసాద్, ఆర్డీఓ పవన్ కుమార్, వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా రవాణా అధికారి కొండల్ రావు, సీఐ వెంకటేశ్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్తదితరులు పాల్గొన్నారు .
అరగంటలో ముగిసిన రామగుండం కౌన్సిల్ మీటింగ్
గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్ 11వ సాధారణ సమావేశం ప్రారంభమైన అరగంటలోనే ముగిసింది. శుక్రవారం కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో డివిజన్లలో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులకు సంబంధించి 130 అంశాలను ప్రవేశపెట్టగా ఎలాంటి చర్చ జరపకుండానే కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన మీటింగ్ 11.30 గంటల వరకే ముగిసింది. ఈ సందర్భంగా మేయర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ జాప్యం చేయకుండా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా సింగరేణి ఓసీపీ 5 వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, బ్లాస్టింగ్‌తో పాటు దుమ్ము, ధూళి వస్తున్నదని, తీర్మానం చేసి ప్రభుత్వానికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పంపించాలని, కాంగ్రెస్ కార్పొరేటర్లు మహాంకాళి స్వామి, పెద్దెల్లి తేజస్విని, గాదం విజయ ప్లకార్డులతో నిరసన తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కమిషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు, ఆఫీసర్లు పాల్గొన్నారు.
లిక్కర్ కేసుతో కవితకు సంబంధం లేదు : పౌర సరఫరాల శాఖ చైర్మన్ రవీందర్ సింగ్
కరీంనగర్ టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ను ఇరకాటంలో పెట్టేందుకే బీజేపీ కుట్ర పన్ని కవితపై కేసులుపెడుతున్నారని, బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ అడ్డంగా దొరికిన దొంగ అని మండిపడ్డారు. తప్పు చేయకపోతే స్టే ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. సంతోష్ జైలుకు పోవడం ఖాయమన్నారు. 4 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి, షిండే లాంటి ఎంతోమందిని కొనుగోలు చేసిన నీతిలేని పార్టీ బీజేపీ అని విమర్శించారు.
సర్పంచుల హక్కులు కాలరాస్తున్నారు : టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం
గంగాధర, వెలుగు: ప్రభుత్వం సర్పంచుల హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం విమర్శించారు. శుక్రవారం మధురానగర్ పార్టీ ఆఫీస్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను బలోపేతం చేసిందని, కాంగ్రెస్ కృషితో జీపీలు అభివృద్ధి చెందాయన్నారు. ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి నిధులను జీపీలకు అందకుండా పక్కదారి పట్టించడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు మనోహర్, బాక్ల్ కాంగ్రెస్ అధ్యక్షుడు బుచ్చయ్య, నాయకులు లచ్చయ్య, గంగయ్య, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నేతకు ఎంపీ పరామర్శ
మెట్ పల్లి, వెలుగు: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బీజేపీ ఐటీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ మిట్టపెల్లి సాయికుమార్ ను నిజామాబాద్ ఎంపీ అరవింద్ పరామర్శించారు. శుక్రవారం సాయికుమార్ ఇంటికెళ్లి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.