ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్​ను గట్టెక్కించే బాధ్యత

  • అసంతృప్తులు, అలకబూనిన వారికి బుజ్జగింపులు
  • ఇతర పార్టీల్లోని సెకెండ్​క్యాడర్​కు గాలం​​
  • కేసీఆర్​పోటీ చేస్తున్న కామారెడ్డిలోనూ సమన్వయ బాధ్యతలు
  • ఎలక్షన్ వేళ ఎమ్మెల్సీ కవితకు జిల్లాపై పూర్తి పెత్తనం

నిజామాబాద్, వెలుగు:​  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్​ జిల్లాలో బీఆర్ఎస్​ను గట్టెక్కించే బాధ్యత ఎమ్మెల్సీ కవితకు అప్పగించినట్లు తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు పోటీ చేసి గెలిచిన సిట్టింగులనే మరోసారి బరిలో నిలిపారు. దీంతో పార్టీలోని ఆశావహుల నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను ఎదుర్కొని, అందరిని సమన్వయం చేస్తూ ముందుకు నడిపే ప్రతినిధి అవసరమని, ఆ బాధ్యతను కవితకు అప్పగించారు. కేసీఆర్​పోటీ చేసే కామారెడ్డిలోనూ లీడర్ల సమన్వయ బాధ్యత ఆమెకే ఇచ్చారు.

అసంతృప్తులకు బుజ్జగింపులు.. 

బీఆర్ఎస్​అభ్యర్థులు ఎవరనేది తేలినందున ఎన్నికలు ముగిసి, రిజల్ట్​వచ్చేదాకా ఎలా ముందుకెళ్లాలో ఎమ్మెల్సీ కవిత ప్లాన్​సిద్ధం చేశారు. పదిరోజుల నుంచి జిల్లాలోని అయిదుగురు సిట్టింగ్​ఎమ్మెల్యేలతో నియోజకవర్గ కేంద్రాల్లో ఇంట్రడక్షన్​ప్రోగ్రామ్​లు నిర్వహించారు. సిట్టింగ్​లను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న సొంత పార్టీ లీడర్ల జాబితాను సిద్ధం చేసుకున్న కవిత, వారిని బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

సిట్టింగులపై అసమ్మతి రాగం..   

జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్​కు చెందిన కీలక లీడర్ల నుంచి సిట్టింగులు అసమ్మతి ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్​ఎమ్మెల్యే జీవన్​రెడ్డి కి, మాక్లూర్​మండలానికి చెందిన జడ్పీ చైర్మన్​దాదన్నగారి విఠల్​రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. బోధన్​ఎమ్మెల్యే షకీల్ ఆమెర్​తో మున్సిపల్​ చైర్​పర్సన్​పద్మ ఆమె భర్త శరత్​రెడ్డి విభేదాలు తారస్థాయికి చేరాయి. షకీల్​కు టికెట్​ఇస్తే ఓడిస్తామని వారు ఎమ్మెల్సీ కవితకు ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రూరల్ నియోజకవర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్​కు కుడి భుజంగా వ్యవహరించిన జిల్లా ఒలింపిక్ క్రీడా సంఘం ప్రెసిడెంట్​గడిల రాములు, ప్రస్తుతం ఆయన నుంచి దూరంగా ఉంటున్నారు. అర్బన్​లో గణేశ్​గుప్తా అభ్యర్థిత్వంపై ఆకుల లలిత ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. కొందరు పార్టీ కార్పొరేటర్లు గణేశ్​పై కొన్నాళ్ల నుంచి గుస్సాతో ఉండగా, ఎంఐఎం లీడర్లతో  అంటీముట్టని వాతావరణం కొనసాగుతోంది. మంత్రి ప్రశాంత్​రెడ్డిపై నేరుగా అసమ్మతి బయటపెట్టకపోయినా, తన దగ్గరి బంధువుకే కాంట్రాక్టులన్నీ ఇస్తున్నారని క్యాడర్​కోపంగా ఉంది. వీళ్లందరితో ఫస్ట్​కవిత భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 

ఆకర్ష్​కు పెద్దపీట..

ఉద్యమకాలం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉండి, అవకాశాలు రాని చాలా మంది లీడర్లు ఛాన్స్​కోసం చూస్తున్నారు. సిట్టింగ్​లపై మంటతో అసమ్మతి రాగం అందుకున్న వారిని సరిచేయడంతో పాటు, అవకాశాలు రాక నిరాశలో ఉన్న వారికి ఇతర పదవుల హామీలిచ్చి అభ్యర్థుల విజయానికి కృషి చేసేలా ప్లాన్​సిద్ధం చేశారు. ప్రతిపక్ష పార్టీల్లో సెకెండ్​క్యాడర్​లీడర్లను పార్టీలో చేర్చుకోవాలని ఎమ్మెల్యేలకు ఆమె నిర్దేశించినట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్​పై పూర్తి పట్టు కోసం..

ఎంత పెద్ద లీడరైనా ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మరో సెగ్మెంట్​జోలికి వెళ్లకుండా సీఎం కేసీఆర్​ మొదటి నుంచి కంట్రోల్​చేస్తున్నారు.. ఎన్నికల సమయంలో ఉండే సున్నిత వాతావరణం దృష్ట్యా అందరికీ ఆమోదయోగ్యమైన, అవసరాన్ని బట్టి గట్టి స్వరం వినిపించేలా మానిటరింగ్​ చేసేందుకు కవితకు బాధ్యత అప్పగించినట్లు స్పష్టమవుతోంది. అసెంబ్లీ ఎలక్షన్​ తర్వాత జరిగే లోక్​సభ ఎన్నికలకు ఈ ఎన్నికల అనుభవం పనికొస్తుందని కవిత భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తండ్రి సెగ్మెంట్​లో..


సీఎం కేసీఆర్​ గజ్వేల్​తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న నేపథ్యంలో స్టేట్​పాలిటిక్స్​ దృష్టి కామారెడ్డిపై పడింది. అక్కడ పార్టీని సమన్వయపరిచే నమ్మకస్తులు కావాల్సిఉండడంతో ఫ్యామిలీ నుంచి కవితను ఎంపిక చేశారు. కవిత కామారెడ్డిలో అన్నీ తానై వ్యవహరించనున్నారు.