నిజామాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌లో ఇరుక్కున్నాక ఎమ్మెల్సీ కవితకు మెమరీ లాసయిందని డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తన సొంత గ్రామంలో 20 మందికైనా పింఛన్లు ఇప్పించారా? అని ఆమె ప్రశ్నించడం విచిత్రంగా ఉందన్నారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులందరికీ పింఛన్లు ఇచ్చిందని అన్నారు.
శుక్రవారం ఆయన జిల్లా పార్టీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పుడున్న సర్కారు బీఆర్ఎస్ కార్యకర్తలకే పథకాలు మంజూరు చేస్తోందన్నారు. లీడర్లు తాహెర్, గడుగు గంగాధర్, ముప్పా గంగారెడ్డి, విక్కీయాదవ్, వేణురాజ్, రాజ్ నరేందర్ పాల్గొన్నారు.