దేశంలో ఎక్క డా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి

దేశంలో ఎక్క డా లేని విధంగా తెలంగాణ అభివృద్ధి

దేశంలో ఎక్కడా జరగనంత అభివృద్ధి తెలంగాణలో జరిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. 75ఏండ్ల పాలనలో గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాని విమర్శించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పేటలో నిర్వహించిన ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పారు. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలని విశ్వసించే తెలంగాణ ప్రభుత్వం అదే స్ఫూర్తితో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తోందని కవిత చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేని అనేక సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, ఆసరా పించన్లు, రైతు బంధు పథకాలే అందుకు నిదర్శనమని చెప్పారు. 

కరోనాతో మూడేండ్లు ఇబ్బంది పడినప్పటికీ, ఒక్క పూట కూడా మిషన్ భగీరథ నీళ్లు ఆగలేదని.. కరెంటు పోలేదని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు, పెన్షన్ ఆపలేదని చెప్పారు. ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ పట్టుదలతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి 57ఏండ్లకే పెన్షన్ ఇవ్వనున్నట్లు కవిత ప్రకటించారు.