మెట్పల్లి వేడుకలో పాల్గొన్న ఎమెల్సీ కవిత
ఉమ్మడి కరీంనగర్జిల్లావ్యాప్తంగా సోమవారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. జగిత్యాల జిల్లా మెట్ పల్లి అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన వేడుకలో నిజామాబాద్ ఎమెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన వేడుకల్లో V6 ఫేమ్ చంద్రవ్వ పాల్గొని సందడి చేశారు. డిప్యూటీ మేయర్ స్వరూపా రాణి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు చంద్రవ్వ హాజరై బతుకమ్మలు పేర్చి ఆడి పాడారు. కరీంనగర్ లోని వికాస్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, వాగేశ్వరి కాంప్యస్ ఆవరణలో నిర్వహించిన సంబరాల్లో చైర్మన్ బీవీఆర్ గోపాల్ రెడ్డి, అకాడమిక్ సెక్రటరి,డాక్టర్ రత్నమాల పాల్గొన్నారు. - వెలుగు, నెట్వర్క్
శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ..
వైభవంగా అమ్మవార్ల ఊరేగింపు
భవాని దీక్షాపరులతో కిక్కిరిసిన ఆలయాలు
తొలిరోజు శైలపుత్రి అలంకారంలో దర్శనం
వెలుగు, నెట్వర్క్:ఉమ్మడి కరీంనగర్జిల్లావ్యాప్తంగా సోమవారం శరన్నవరాత్రులు వైభవంగా ప్రారంభమయ్యాయి. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో భవానీ దీక్షాపరులు మాలధారణ చేశారు. శ్రీస్వర్ణ కవచాలంకృతా దేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. బీజేసీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల పట్టణంలోని భక్త మార్కండేయ దేవాలయం, అష్టలక్ష్మి ఆలయం, శ్రీరామ థియేటర్, ఎల్లమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు
ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో పురవిధుల్లోని టాకా సంధి, బైపాస్ రోడ్డులో డప్పుచప్పుళ్ల మద్య దుర్గదేవి విగ్రహాల ఊరేగింపు ప్రారంభమైంది. చిన్నారుల వేషధారణల మధ్య మహిళలు మంగళహారతులతో శోభాయాత్ర నిర్వహించారు. మల్లాపూర్ మండలంలోని గ్రామాలలో కనకదుర్గాదేవి కమిటీల ఆధ్వర్యంలో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించి విగ్రహాలను ప్రతిష్ఠించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొదటిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. జమ్మికుంట మండల పరిధిలోని అన్ని గ్రామాలలో దుర్గమాత విగ్రహాలను
ప్రతిష్ఠించారు.
బుగ్గారం మండలాధ్యక్షుడిగా శ్రీధర్
జగిత్యాల, వెలుగు: బీజేపీ బుగ్గారం మండలాధ్యక్షుడిగా మేడవేణి శ్రీధర్ ను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని యశ్వంత్ రావు పేటకు చెందిన శ్రీధర్ పార్టీకి అందిస్తున్న సేవలను గుర్తించి ఈ నియామకం చేపట్టామని, తక్షణమే నియామకం అమల్లోకి వస్తుందని సత్యనారాయణ రావు పేర్కొన్నారు. తన నియామకానికి కృషిచేసిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణకు, స్వచ్ఛభారత్ కన్వీనర్ రాజేశ్‌కు శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు.
వైభవంగా దుర్గమాత శోభాయాత్ర
దర్శించుకున్న బీజేపీ నేతలు
వేములవాడ, వెలుగు: నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని గాంధీనగర్ దుర్గమాత శోభాయాత్ర సోమవారం వైభవంగా సాగింది. సుభాశ్‌నగర్ లో సుభాశ్మహంకాళి యూత్, అంజనీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గమాతను డప్పు వాయిద్యాలతో తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, దళిత మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శంకర్, విగ్రహ దాత కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్, యాచమనేని శ్రీనివాస్ రావు, ఆద్య ఫౌండేషన్ చైర్మన్ మోహన్, బీజేపీ పట్టణాధ్యక్షుడు సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
బ్రిడ్జి ప్రారంభించాలని కలెక్టర్‌కు వినతి
రామడుగు, వెలుగు: మండల కేంద్రంలోని వాగుపై కొత్తగా నిర్మించిన బ్రిడ్జిని తక్షణమే ప్రారంభించాలని యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు నాగి శేఖర్ సోమవారం కలెక్టర్కర్ణన్కు వినతి పత్రం అందజేశారు. పాత బ్రిడ్జి పూర్తిగా దెబ్బతినడంతో ప్రమాదకరమని అధికారులు రాకపోకలు నిలిపివేశారని దీంతో జిల్లా కేంద్రానికి, వివిధ మండలాలకు వెళ్లాలంటే చుట్టూ 20 కిలోమీటర్లు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తోందని తెలిపారు. అలాగే గుండి, నారాయణపూర్, చెర్లపల్లి, చొప్పదండిలోని తొగరుమామిడికుంటలో గల డీ-86 కాలువ బ్రిడ్జిలు శిథిలావస్థలో ఉన్నాయని, వీటిని వెంటనే రిపేర్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు దేవకిషన్, అజయ్, మల్లేశ్, మహేశ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఐలమ్మ జయంతి వేడుక
నిజాం వ్యతిరేక పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు పెద్దపల్లి జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లిలో బీజేపీ సీనియర్ లీడర్ గొట్టిముక్కుల సురేశ్ రెడ్డి, ధర్మారంలో బీజేపీ దళితమోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఐలమ్మ గొప్పతనాన్ని కొనియాడారు. వేములవాడలో తెలంగాణ చౌక్ లో, పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసులో చాకలి ఐలమ్మ చిత్రపటానికి చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గంగాధరలో ఎమ్మెల్యే రవిశంకర్, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, హుజూరాబాద్ లో మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, వైస్ చైర్ పర్సన్ నిర్మల, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, అధికారులు, కరీంనగర్ లో కలెక్టర్ కర్ణన్, డిప్యూటీ మేయర్ స్వరూపరాణి, జడ్పీ చైర్ పర్సన్ విజయ, మేయర్ సునీల్ రావు, జగిత్యాల జిల్లా పరిషత్ ఆఫీస్‌లో చైర్ పర్సన్ దావ వసంత, జెడ్పీ సీఈఓ రామానుజన్ చార్యులు, కోనరావుపేట మండలవ్యాప్తంగా లీడర్లు నివాళులర్పించారు. జమ్మికుంటలో రజకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. - వెలుగు, నెట్వర్క్
న్యాయవాద వృత్తికి ఉజ్వల భవిష్యత్
కిమ్స్ చైర్మన్ రవీందర్ రావు
కరీంనగర్ టౌన్, వెలుగు: శ్రద్ధతో చదివితే న్యాయవాద వృత్తికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కిమ్స్ విద్యాసంస్థల అధినేత, చైర్మన్ డాక్టర్ పేర్యాల రవీందర్ రావు అన్నారు. సోమవారం వెదిరలోని కిమ్స్ లా కాలేజీలో నిర్వహించిన ఫేర్ వెల్ ప్రోగ్రామ్ లో వైస్ చైర్మన్ సాకేత్ రామారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయవాద సబ్జెక్టును క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు. క్రమశిక్షణతో వృత్తిలో కొనసాగితే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పోస్టు వరకు వెళ్లవచ్చని, అందుకు ఉదాహరణ ఎల్వీ రమణ అని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థులు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్ అలరించాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్, లెక్చరర్స్, స్టూడెంట్స్ పాల్గొన్నారు.
రైతులకు అండగా ఉంటాం
సింగిల్‌విండో చైర్మన్ సుధీర్ రావు
ఎల్లారెడ్డిపేట, వెలుగు: రైతులకు ఎల్లప్పుడూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అండగా ఉంటుందని తిమ్మాపూర్ సింగిల్‌విండో చైర్మన్ రామగిరిసుధీర్ రావు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ లో సోమవారం జరిగిన సింగిల్ విండో మహాజన సభలో ఆయన మాట్లాడారు. రైతులకు సకాలంలో సబ్సిడీ ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. డెయిరీ, గొర్రెలు, కోళ్ల పెంపకం, బోరు మోటార్ పైప్ లైన్, ట్రాక్టర్, హార్వేస్టర్ లకు ఇచ్చే దీర్ఘకాలిక రుణాలు ఉపయోగించుకుని రైతులు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. కార్యక్రమంలో ఉపా
ధ్యక్షులు బుగ్గ కృష్ణమూర్తి, డైరెక్టర్లు కరికే శ్రీనివాస్, పెంజర్ల నారాయణ, గుర్రాల సత్యారెడ్డి, గంగవ్వ, లక్ష్మణ్, నరహరి తదితరులు
పాల్గొన్నారు.
భగవతి, ఆర్విన్ ట్రీ స్కూల్స్ కు అవార్డులు
కరీంనగర్ టౌన్, వెలుగు: పట్టణంలోని భగత్ నగర్ భగవతి, ఆర్విన్ ట్రీ పాఠశాలలకు ఇంటర్నేషనల్ గ్రీన్ స్కూల్ అవార్డు అభించినట్లు చైర్మన్ బి.రమణారావు సోమవారం తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో శనివారం జరిగిన గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్ లో భాగంగా రెస్పాన్సిబుల్ ఎడ్యుకేషన్ ఫర్ సస్టెయినబుల్ ఫ్యూచర్ అనే అంశంపై నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ఈ అవార్డు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యతోపాటు సేవ్ ఎర్త్, వాటర్, ఎయిర్, లైట్ అండ్ స్పేస్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.
స్పోర్ట్స్ స్కూల్లో అధికారుల విచారణ
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్లో సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన ఆఫీసర్లు విచారణ చేపట్టారు. ఇటీవల స్పోర్ట్స్ స్కూల్లో సౌకర్యాలు, కోచ్ లు, మెస్ సమస్యలపై ‘వెలుగు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. హైదరాబాద్ డీవైఎస్ఓ సుధాకర్, డీడీ చంద్రారెడ్డిని విచారణకు ఆదేశించడంతో వారు సోమవారం పాఠశాలను పరిశీలించి అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్స్ ఉన్నపుడు, వెళ్లేటపుడు ఎలాంటి క్రమశిక్షణను నేర్పిస్తున్నారంటూ వార్డెన్ ను మందలించారు. పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్త, గడ్డిని తొలగించాలని, హాస్టల్ మెయింటెనెన్స్సరిగ్గా ఉండాలని సూచించారు. ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని చంద్రారెడ్డి తెలిపారు. వీరివెంట కరీంనగర్ డీవైఎస్ఓ రాజ్ వీర్ ఉన్నారు.
నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యమివ్వాలి
ఎంపీపీ కేతిరెడ్డి వనిత
తిమ్మాపూర్, వెలుగు : గర్భిణులు పౌష్టికాహారం తీసుకుని, నార్మల్ డెలివరీకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ కేతిరెడ్డి వనిత తెలిపారు. సోమవారం మండలంలోని మహాత్మనగర్ పంచాయతీ ఆఫీస్‌లో గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు గర్భిణులకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాయని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. అనంతరం గర్భిణులకు పసుపు, కుంకుమ, గాజులు, పూలు, పండ్లు, చీరలు అందజేసి సీమంతం చేశారు. కార్యక్రమానికి వార్డు సభ్యులు అడిచర్ల లక్ష్మీసత్యనారాయణ దాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో సర్పంచ్ జక్కని శ్రీవాణి రవీందర్, ఏసీడీపీఓ సరస్వతి, సూపర్వైజర్ శ్రీలత, అంగన్వాడీ టీచర్లు పద్మ, కవిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.