జగిత్యాల టౌన్, వెలుగు: దేశవ్యాప్తంగా ఎక్కువ సంక్షేమ పథకాలు పొందుతున్నది తెలంగాణ ప్రజలేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి వద్ద శనివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ రమణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గెలిచాక పెన్షన్లు ఏటా రూ.500 చొప్పున రూ.5వేలకు పెంచుతామన్నారు. బీడీ కార్మికులకు, ఆడబిడ్డలకు సౌభాగ్యలక్ష్మి స్కీమును అమలు చేస్తామన్నారు.
జగిత్యాల అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేయలేదంటాడు. ఆయన మాట్లాడేవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. జీవన్ రెడ్డి ముస్లింల ఇంటికి వెళ్లి వాళ్లు పెట్టిన బిర్యాని తింటాడు కానీ వాళ్ల అభివృద్ధి గురించి పట్టించుకోడన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను అమ్ముకున్నాడని ఆ పార్టీ లీడర్లే చెబుతున్నారన్నారు. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.