ఆడపిల్ల శవంతో రాజకీయం చేసి.. ప్రజలను మభ్యపెట్టి ఒక పర్సెంట్ ఆగమాగం చేసి అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. జీవో నెంబర్ 3ను రద్ద చేయాంటూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ దగ్గర ఆమె ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఇవాళ మనకు రెండు పండుగలు.. ఒకటి మహిళా దినోత్సవం.. మరొకటి శివరాత్రి.. ఈరోజు మహిళల కోసం ధర్నా చేయడం పుణ్యమే అన్నారు. మహిళా లోకంలో చదువుకునే వాళ్ళు తక్కువ అంటే.. సర్కారీ నౌకరి సంపాదించేవాళ్లు మరీ తక్కువగా ఉంటారని చెప్పారు. 1996లో పీవీ నరసింహారావు మహిళల కోసం విద్యలో 33% రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేశారని ఆమె అన్నారు. కొత్త ప్రభుత్వం వస్తే.. పాత ప్రభుత్వంలోని తప్పులను సరిచేసి ప్రజలకు మంచి చేయాలి.. కాని, కాంగ్రెస్ అలా చేయడం లేదని మండిపడ్డారు కవిత.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో డైరెక్ట్ గా దొరికిన వ్యక్తి అని. .ఈ కేసు నుంచి బయటపడాలని రేవంత్ కొట్లాడుతున్నాడని.. తన ఓటుకు నోటు కేసుపై ఉన్న శ్రద్ధ.. ఆడబిడ్డల సమస్యలపై శ్రద్ధ లేకపోవడం దురదృష్టకరమని దుయ్యబట్టారు. జీవో 3ని రద్దుచేసి 33% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆడపిల్లలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని పోతే అపాయింట్మెంట్ కూడా కరువైందని.. 90 రోజుల్లో ఒక్కనాడైన రేవంత్ రెడ్డి కలవలేదని.. ప్రజాపాలన అని మాటలకే పరిమితం చేశాడని విమర్శించారామె. రెండు రోజులకు ఒకసారి రేవంత్ రెడ్డి.. ఢిల్లీ వెళ్లి సోనియా దగ్గర హాజరు వేసుకోవాలని ఎద్దేవా చేశారు. జీవో 3ని వెనక్కి తీసుకునే వరకు మిమ్మల్ని నిద్రపోనియ్యమ్.. స్ట్రీట్ ఫైట్, లీగల్ ఫైట్ చేస్తామని కవిత హెచ్చరించారు.