గజ్వేల్​లో ఈటల పోటీ చేసినా గెలుపు కేసీఆర్దే : కవిత

నిజామాబాద్, వెలుగు: రైతు బంధును ఆపాలని ఎన్నికల కమిషన్​కు కాంగ్రెస్ లెటర్​రాసిందని, ఆ ఒక్క స్కీం ఆపితే చాలా లేదంటే పేదలకు ఇచ్చే బియ్యం, అవ్వల ఆసరా పింఛన్ కూడా అందులో చేర్చాలా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ​లాంటి స్కీంలు ఆపే కుట్ర కూడా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ సారి ఎన్నికలు రైతులకు, రాహుల్​గాంధీకి మధ్య జరుగుతున్నాయన్నారు. గురువారం ఆమె నిజామాబాద్​లో మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కాంగ్రెస్​కు కొత్త గా కనిపిస్తున్నట్లున్నయ్. అందుకే అడ్డుకుంటున్నది. రాహుల్​గాంధీ వచ్చి తెలంగాణ ప్రజలకు గ్యారంటీలు ఇస్తే నమ్ముతరా. కాంగ్రెస్​పాలిత రాష్ట్రాల్లో యువతకు జాబ్​క్యాలెండర్​ఎక్కడ ప్రకటించారో చెప్పాలె. రైతుల కంటే మాకు ఏదీ ఎక్కువకాదు. వారు వద్దనడంతో కామారెడ్డి మాస్టర్​ప్లాన్ నాలుగు నెలల కిందే ఆపినం’ అని ఆమె పేర్కొన్నారు. పాలిటిక్స్​లో జంప్​జిలానీలు పెరిగారు. పగోడు, పాలోడు తెలుస్తలే, ఒక్క కేసీఆర్​ను ఓడించడానికి సమీకరణాలు ఎలా మారుతున్నాయో గమనించాలని, కోమటిరెడ్డి రాజ్​గోపాల్​రెడ్డిని ఉదహరిస్తూ కామెంట్​చేశారు.

కేసీఆర్​ను గెలిపించేది ప్రజలే

కామారెడ్డి నుంచి కేసీఆర్ ​గెలుపు ఉమ్మడి జిల్లా అభివృద్ధిని మలుపు తిప్పుతుందని కవిత అన్నారు. ‘కేసీఆర్ రాష్ట్రమంతా ప్రచారం చేస్తరు. ఆయన గెలుపు కోసం నిత్యం ప్రజల్లో ఉండే కార్యకర్తలు కష్టపడ్తరు. అంతిమంగా గెలిపించేది ప్రజలే. గజ్వేల్​లో ఈటల రాజేందర్​పోటీ చేసినా గెలుపు కేసీఆర్​దే. కోరుట్లలో పోటీ చేస్తున్న అర్వింద్​ను ఓడిస్తం. మా కార్యకర్తలు ఆ విషయాన్ని నిజం చేసి చూపిస్తరు. బీజేపీ పట్ల ప్రజలకు నమ్మకం లేదు. ఓబీసీ బిల్లును పార్లమెంటులో ఎప్పుడూ ప్రవేశపెట్టినా బీఆర్​ఎస్​మద్దతిస్తుంది’ అని అన్నారు.