తెలంగాణలో లౌకికవాదాన్ని కాపాడుకోవాలి : ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లౌకికవాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత అన్నారు. లౌకికవ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్​ ఏడాది పాలనలో ఎన్నో చోట్ల మతకలహాలు రేగాయని, ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి లేకుండా పోయిందని విమర్శించారు. 

మంగళవారం తెలంగాణ ఫుడ్స్​ మాజీ చైర్మన్​ మేడే రాజీవ్​సాగర్, క్రిస్టియన్​ జేఏసీ ప్రతినిధులు, బీఆర్ఎస్​ నేతలు ముఠాగోపాల్​తదితరులు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ మత విద్వేషాలకు అడ్డుకట్ట వేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. బీసీ మహిళలకు కోటా కల్పించేందుకు కూడా తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమాలకు మద్దతిస్తున్నామని తెలిపారు.