నిజామాబాద్, వెలుగు: తెలంగాణలో నడుస్తున్నది బీఆర్ఎస్ సర్కార్ కాదని.. బీసీల సర్కార్ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కనుమరుగైన కులవృత్తులను ప్రోత్సహిస్తూ సీఎం కేసీఆర్ బీసీలకు అండగా ఉంటున్నారన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించిన గౌడ, నాయీ బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఓట్ల కోసం వచ్చే పార్టీలను చూసి ఆగం కావొద్దన్నారు. ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకుని.. హక్కుగా ఓట్లు అడగడానికి వచ్చామని, మరోసారి ఆశీర్వదించాలని కోరారు. చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ కల్పించాలంటూ అసెంబ్లీ తీర్మానం చేసిన లీడర్ కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో 35 వేల సెలూన్ షాప్‌లకు సబ్సిడీ కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. కల్లు వ్యాపారం చేసే గౌడ కులస్తుల కోసం ఈత వనాలు విస్తరించామన్నారు.