రాహుల్ గాంధీ అవుట్‌‌ డేటెడ్ ​లీడర్: ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల, వెలుగు :  రాహుల్ గాంధీ అవుట్ డేటెడ్ లీడర్​అని, కాంగ్రెస్ అంటే రావణ సైన్యమని ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో విమర్శించారు. జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ మ్యాంగో మార్కెట్​లో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే రూ.4 వేల ఫించన్​ఇస్తామని ఆ పార్టీ లీడర్లు ప్రగల్బాలు పలుకుతున్నారని, కర్ణాటకలో ఇవ్వలేని వారు ఇక్కడ ఇస్తారా అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే పోడు పట్టాలు ఇస్తామంటున్న ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే.. రాష్ట్రంలో ఇప్పటికే పోడు పట్టాలు ఇచ్చిన విషయం తెలుసుకోవాలన్నారు. ఖర్గే అప్​డేట్​కావాలని ఎద్దేవా చేశారు.

ALSO READ: ఎకానమీకి ప్యాకేజింగ్​ కీలకం .. డబ్ల్యూపీఓ గ్లోబల్​ అంబాసిడర్​ చక్రవర్తి

కేసీఆర్ సీఎం అయ్యాక ప్రతి పల్లెకు నీళ్లు, నిధులు, ఉపాధి అవకాశాలు లభించాయన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని చెప్పారు. ఇవే తన చివరి ఎన్నికలంటూ  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 2014, 2018 అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారని కవిత విమర్శించారు. తన మరదలికి మున్సిపల్​ చైర్మన్​పదవి కట్టబెట్టారన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ మాత్రం ఒక పద్మశాలి బిడ్డకి పదవి ఇచ్చారని చెప్పారు.

జగిత్యాల మున్సిపాలిటీ రూపురేఖలు మార్చేందుకు రూ.130 కోట్లు తెచ్చారని, జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని కోట్లు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో సంజయ్ గెలిచిన మర్నాడు అల్లీపూర్ ను మండల కేంద్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.