టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్‌రెడ్డిని తొలగించండి: ఎమ్మెల్సీ కవిత

టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డిపైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి ఆరోపణలు వస్తున్న మహేందర్ రెడ్డిపైన జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మహేందర్‌రెడ్డిని పదవి నుంచి తొలగించాలని  తెలిపారు. 

కేసీఆర్ చేసిన పనులను తాము చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.  ప్రభుత్వంలో ఉండి కేసీఆర్‌ను ఇష్టానుసారం దూషిస్తున్నారని.. తెలంగాణ ఉద్యోగాలను ప్రభుత్వం ఆంధ్ర వారికి ఇస్తోందని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడం సీఎం రేవంత్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. సింగరేణిలో ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలను ఇస్తోందని చెప్పారని... జనరల్ మేనేజర్ స్థాయిలో ఇవ్వాల్సిన ఉద్యోగాలను హైదరాబాద్ లో సీఎం స్థాయి వ్యక్తులు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తూ.. తామే ఉద్యోగాలు ఇస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పారు.

గతంలో సలహాదారులే వద్దన్న రేవంత్‌రెడ్డి ఇప్పుడెలా నియమిస్తున్నారని.. ఇదంతా రాజకీయ పునరావాసం కోసం కాదా? అని కవిత నిలదీశారు. తెలంగాణలో కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్లని డైరెక్టర్‌లను నియమించారు కాబట్టి..  ఇక్కడ నిరంతర కరెంట్ ఇవ్వడంలో  ఆంధ్రవాళ్లు ఏ మేరకు భాగస్వామ్యం అవుతారని ప్రశ్నించారు.