నిజామాబాద్, వెలుగు : తెలంగాణ ప్రస్తావన లేకుండా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనే బీజేపీ, భారత్ జోడో యాత్ర నిర్వహించిన కాంగ్రెస్ అవసరం ఇక్కడి ప్రజలకు లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అబద్ధాలు చెప్పి వెళ్లారని ఆమె ఆరోపించారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నగరంలోని ఆమె తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో బీసీలకు రూ.వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టలేదని మోదీ అబద్ధాలు చెప్పారని, ఇక్కడి బీసీ బడ్జెట్ రూ.6,200 కోట్లని పేర్కొన్నారు.
అలాగే ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి రూపంలో ఏడాదిన్నర కాలంలో రూ.1,850 కోట్లను తమ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. ‘‘బీసీ స్టూడెంట్లకు రూ.1,300 ఖర్చు చేసినం. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలకు తెలంగాణ అంటే చిన్నచూపు. విభజన హామీలపై ప్రధాని మాట్లాడరు. ఖమ్మంలో అన్యాయంగా ఇక్కడి మండలాలను ఆంధ్రాలో కలిపారు. స్టీల్ ఫ్యాక్టరీ ఊసే లేదు. మహబూబాబాద్‌లో ఎస్టీ యూనివర్సిటీ ఏర్పాటును పక్కన బెట్టిన్రు. తెలంగాణపై ప్రేమ ఉంటే ఐఐటీ, ఐఎంఎం, మెడికల్ కాలేజీ ఏర్పడేవి.
రాష్ట్రానికి అదనంగా రూపాయి సహాయం చేసింది లేదు” అని కవిత విమర్శించారు. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించి ఓసీకి ఆ స్థానం అప్పగించిన బీజేపీ.. తమ పార్టీ గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని ఇచ్చిన హామీ నవ్వు తెప్పిస్తోందని ఆమె ఎద్దేవా చేశారు. అలాగే షాదీ ముబారక్ కాకుండా ముస్లింలకు ఏమిచ్చారని కాంగ్రెస్ అర్బన్ అభ్యర్థి షబ్బీర్ అలీ అడుగుతున్నరని, ముస్లిం విద్యార్థుల కోసం 204 స్కూళ్లను తమ ప్రభుత్వం స్థాపించిందని పేర్కొన్నారు.
ఎప్పుడూ బీఆర్ఎస్తో కాంగ్రెస్ పోల్చరాదన్నారు. అర్బన్ లో షబ్బీర్‌అలీ గెలువరని వ్యాఖ్యానించారు. కాగా, ఉదయం నగరంలోని ముస్లిం మతపెద్దలతో కవిత సమావేశమై బీఎర్ఆర్కు మద్దతు ఇవ్వాలని కోరారు.