- సొంత వ్యూహాలతోనే రెండు చోట్లకేసీఆర్ పోటీ
- ఎన్నికల ముందు వచ్చే గాంధీలు రెడ్డిలు మనకెందుకు: ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, వెలుగు : ముఖ్యమంత్రిగా, బీఆర్ఎస్పార్టీ అధ్యక్షుడిగా, జాతీయస్థాయి నాయకుడిగా సీఎం కేసీఆర్ ఓవ్యూహం ప్రకారం రెండు చోట్ల పోటీ చేస్తుంటే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బీజేపీకి చెందిన ఈటల రాజేందరన్న కూడా రెండు సెగ్మెంట్ల నుంచి పోటీ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోమవారం సాయంత్రం ఆమె బోధన్‌లోని శక్కర్నగర్మైదానంలో కుల సంఘాల గర్జన పేరుతో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.
‘రకరకాల వ్యూహాలతో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తుంటే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు రేవంత్‌రెడ్డి, ఈటల రాజేందర్ తీరుంది. వారికి వాతలు మాత్రమే మిగులతయ్. రిజల్టేమీ ఉండదు. వారు మూడు చోట్ల పోటీ చేసినా అల్టిమేట్‌గా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీయే. కేసీఆర్ద్వారా రాష్ట్రానికి బలమైన పునాదులు పడ్డయ్. మరింత ఎదిగే రోజులు ముందున్నయ్. నీళ్లు, నిధులు, విద్యుత్‌లో మిగులు సాధించాం. పిల్లల చదువులపై ఫోకస్పెట్టాం.
ఎన్నికల్లో మాత్రమే కనబడే గాంధీలు, రెడ్డీలు మనకు వద్దు’ అన్నారు. ‘ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాని మోదీకి స్వాగతం. చిత్తశుద్ధితో ఇక్కడి అభివృద్ధిని చూడాలె. బీసీలపై నిజమైన ప్రేముంటే కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ఇవ్వాలె. బీసీ గణన ప్రకటించాలె. ఉట్టిమాటలు చెప్పొద్దు. రేపో, ఎల్లుండో వచ్చే రాహుల్‌గాంధీ తీరు అంతే. రూ.4 వేల కోట్ల డబ్బు ఖర్చు చేసి కాంగ్రెస్గవర్నమెంట్హయాంలో చేసిన కులగణన రిపోర్టు ఎందుకు బయటపెట్టలేదో చెప్పాలె. బీజేపీ, కాంగ్రెస్మొసలి కన్నీళ్లకు కరగొద్దు’ అని కవిత సూచించారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేయించినందున కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు అర్హులకు అందించగలుగుతున్నామన్నారు.
ఎన్నికల కోసం బీసీలపై ప్రేమ
కేంద్రంలో ప్రధాని మోదీ గవర్నమెంట్బీసీలను మోసం చేస్తుంటే పనికి రాని ప్రతిపక్షంగా కాంగ్రెస్ మారిందని ఎమ్మెల్సీ కవిత సోమవారం నిజామాబాద్మీడియా సమావేశంలో విమర్శించారు. ‘బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించిన బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనడం విడ్డూరం. వారు గెలిచేది లేదు బీసీని సీఎంను చేసేదీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం చేసే బీసీ డిక్లరేషన్‌తో వారి పాపాలు తొలిగిపోవు. కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్ అర్బన్‌లో ఎలా చెల్లుతుంది?’ అని షబ్బీర్‌అలీని ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆమె వెంట ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్, అర్బన్, ఆర్మూర్ అభ్యర్థులు గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. బోధన్ సభలో ఎంపీ బీబీపాటిల్, అక్కడి ఎన్నికల అభ్యర్థి షకీల్ ఆమెర్, మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ పాల్గొన్నారు.