రేవంత్​ పిట్ట బెదిరింపులకు ఎవరూ భయపడరు : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, వెలుగు: ఈ అసెంబ్లీ ఎన్నికలు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి, కాంగ్రెస్ అరాచకానికి మధ్య జరుగుతున్నాయని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. టీపీసీసీ రేవంత్ రెడ్డి పిట్ట బెదిరింపులకు భయపడేవారేరూ లేరని హెచ్చరించారు. బుధవారం సాయంత్రం నిజామాబాద్​లో కవిత మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్​కు 80 సీట్ల కంటే తక్కువ వస్తే ఏ శిక్షకైనా రెడీ అని రేవంత్ సవాల్​విసరడం హాస్యాస్పదం అన్నారు.

గత ఎన్నికల్లో కొడంగల్​లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పిన మాట ఏమైందని కవిత ప్రశ్నించారు. కాంగ్రెస్​ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా.. అక్కడ మూడు నెలల్లో రాజకీయ అస్థిరత్వం ఏర్పడుతోందన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్​మధ్య కోల్డ్​వార్ నడుస్తుంటే,  సతీశ్​అనే ఎమ్మెల్యే తాను సీఎం అవుతానంటున్నారన్నారు. రాజస్థాన్ లో అశోక్​గెహ్లాట్, సచిన్​పైలెట్​ ఎప్పుడూ కొట్లాడుకుంటారని ఎద్దేవా చేశారు.

మధ్యప్రదేశ్​లో కమల్ నాథ్, జ్యోతిరాదిత్య సింధియా కొట్లాటతో ఏడాదిలో గవర్నమెంట్​కూలిందన్నారు. పూటకో సీఎం తెలంగాణకు అక్కర్లేదని కవిత చెప్పారు. సుస్థిరత ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, అభివృద్ధి సాధ్యమని తెలిపారు. నెహ్రూ ఎస్సారెస్పీ ప్రాజెక్టును మొదలుపెడితే సీఎం కేసీఆర్ ​పూర్తి చేశారన్నారు. జిల్లా అంతటా తిరిగి చూస్తే పంటల విస్తీర్ణం ఎంత పెరిగిందో రేవంత్​కు అర్థమవుతుందన్నారు.

కేసీఆర్​ పెంచిన రిజర్వేషన్​తో గిరిజన స్టూడెంట్లకు ఉన్నత విద్య అందుతోందన్నారు. 3,300 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత తమదేనన్నారు. అల్లర్లు ఆపిన పోలీసులకు రేవంత్​రెడ్డి వార్నింగ్​ఇవ్వడమేంటని కవిత ప్రశ్నించారు. రౌడీయిజం, గుండాయిజాన్ని ప్రోత్సహించే వారికి పట్టం కట్టొద్దని కోరారు. ఆమె వెంట మేయర్​నీతూ కిరణ్​ఉన్నారు.