రేవంత్‌‌రెడ్డి ఫ్లైట్‌‌ మోడ్‌‌ సీఎం : ఎమ్మెల్సీ కవిత

రేవంత్‌‌రెడ్డి ఫ్లైట్‌‌ మోడ్‌‌ సీఎం : ఎమ్మెల్సీ కవిత

బాన్సువాడ, వెలుగు : రేవంత్‌‌రెడ్డి ఫ్లైట్‌‌ మోడ్‌‌ సీఎం అని, ఆయన 40 సార్లు ఢిల్లీ వెళ్లినా ఏమీ సాధించలేకపోయారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. తెలంగాణ పాలన హైదరాబాద్‌‌ కేంద్రంగా నడుస్తుందా ? ఢిల్లీ కేంద్రంగా నడుస్తుందా ? అని ప్రశ్నించారు. నిజామాబాద్‌‌ జిల్లా బాన్సువాడ పెద్ద మసీదు వద్ద సోమవారం నిర్వహించిన ఇఫ్టార్‌‌ విందులో ఆమె మాట్లాడారు. మైనార్టీల పక్షాన కొట్లాడేది బీఆర్‌‌ఎస్‌‌ మాత్రమేనని, వక్ఫ్‌‌ బోర్డు చ‌‌ట్ట స‌‌వ‌‌ర‌‌ణ బిల్లుకు బీఆర్‌‌ఎస్‌‌ వ్యతిరేకమన్నారు.

15  నెలల్లో రూ. 1.50 లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్‌‌రెడ్డి షాదీ ముబార‌‌క్‌‌ కింద తులం బంగారం మాత్రం ఇవ్వడం లేదన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి ఏం చేయాలన్నా.. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి వెళ్లి పర్మిషన్‌‌ తెచ్చుకోవాలని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పేదలందరికీ మంచి చేయాలన్న సంకల్పంతో కేసీఆర్‌‌ పనిచేశారని, ఆ సోయి ప్రస్తుత సీఎం రేవంత్‌‌రెడ్డికి లేదన్నారు. ముస్లింలకు ఇచ్చే రంజాన్‌‌ తోఫాను కూడా కాంగ్రెస్‌‌ ప్రభుత్వం బంద్‌‌ పెట్టడం దారుణం అన్నారు.

మైనార్టీల బడ్జెట్‌‌ను ఎందుకు ఖర్చు చేయడం లేదని ఈద్‌‌ ముబారక్‌‌ చెప్పేందుకు వచ్చే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌‌రెడ్డిని నిలదీయాలని సూచించారు. కాంగ్రెస్‌‌ ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ బకాయిలు కూడా విడుదల చేయడం లేదన్నారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బాన్సువాడ మున్సిపల్‌‌ వైస్‌‌చైర్మన్‌‌ జుబేర్, బీఆర్ఎస్ నాయకులు గణేశ్‌‌, సాయిబాబా, ఎజాజ్, రజాక్, సంపత్‌‌గౌడ్‌‌, అయేషా ఫాతిమా, చాకలి సాయిలు, శివ సూరి పాల్గొన్నారు.