- కేసీఆర్‌వి మానవీయ పథకాలు..
నిజామాబాద్, వెలుగు: పేద కుటుంబాలకు సరిపడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టలేకపోయామని, అది తమ తప్పేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘‘భూమి దొరక్క ఇండ్ల నిర్మాణం చేపట్టలేకపోయాం. ఈ బాధ మాలో కూడా ఉన్నది. ఈసారి ప్రభుత్వం ఏర్పడగానే ఇండ్ల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. ప్రైవేట్ ల్యాండ్ కొనైనా సరే ప్రజల డిమాండ్ మేరకు ఇండ్లు నిర్మించి ఇస్తాం” అని చెప్పారు.
శుక్రవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్‌షోలో కవిత మాట్లాడారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని జాబ్స్ యూత్‌కు ఇచ్చామని, మరిన్ని ఉద్యోగాలు ఇచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. ‘‘కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని నిరీక్షిస్తున్న వాళ్లందరికీ ఎలక్షన్లు కాంగానే కొత్త కార్డులిస్తాం. సన్నబియ్యం పంపిణీ షురూ చేస్తాం. కేసీఆర్ సర్కార్ లా అండ్ ఆర్డర్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. గడిచిన పదేండ్లలో ఎక్కడా మత ఘర్షణలు జరగలేదు. నిజామామాద్ జిల్లాలో ఒక్కటే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంటే, మేం 22కు పెంచాం” అని తెలిపారు.
కేసీఆర్‌వి మానవీయ పథకాలు..
పేద కుటుంబాలకు మేలు చేసే పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని కవిత అన్నారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్.. షాదీ ముబారక్ లాంటి స్కీమ్‌లను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్‌కు ఉన్నత విద్య అవకాశాలు పెంచడంతో ఐఐటీ, ఐఐఎం లాంటి విద్యాసంస్థలతో పాటు సివిల్‌సర్వీసెస్ కు ఎంపిక అవుతున్నారని చెప్పారు. ‘‘రెండు దఫాలు కేసీఆర్‌కు అధికారమిచ్చిన ప్రజలకు క్రమపద్ధతిలో చేయగలిగినంత చేశాం. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి” అని అన్నారు. రోడ్ షోలో నిజామాబాద్ అర్బన్అభ్యర్థి గణేశ్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.