ఢిల్లీ లిక్కర్ స్కాంలో నోటీసులు అందుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు (డిసెంబరు 6న) విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు లేఖ రాశారు. ముందే ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో రేపు విచారణకు రాలేనని అందులో స్పష్టం చేశారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. తాను ఎఫ్ఐఆర్ కాపీని అడిగితే వెబ్ సైట్ లో చూసుకోవచ్చని సీబీఐ అధికారులు చెప్పారని కవిత పేర్కొన్నారు. వెబ్ సైట్ లో ఉన్న ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించిన నిందితుల జాబితాను తాను క్షుణ్నంగా పరిశీలించానని, దానిలో తన పేరు లేదన్నారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత చెప్పారు. పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు విచారణకు హాజరవుతానని లేఖలో తెలిపారు.
సీబీఐ నోటీసులు జారీ చేయగానే.. డిసెంబరు 6న విచారణకు అందుబాటులో ఉంటానని కవిత చెప్పారు. అయితే ఒకరోజు తర్వాత కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. కవిత అభ్యర్థనపై స్పందించిన సీబీఐ అధికారులు ఈ -మెయిల్ ద్వారా సమాధానం ఇచ్చారు. ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉందని అన్నారు. ఈ సమాచారం ప్రకారం సీబీఐ వెబ్ సైట్ లో ఉన్న ఎఫ్ఐఆర్ ను చెక్ చేసుకున్న కవిత.. అందులో తన పేరు లేదంటూ తాజాగా ఇవాళ లేఖను విడుదల చేశారు.