
- ఢిల్లీ ధర్నాకు రాకుండా బీసీలను రాహుల్ గాంధీ అవమానించారని ఫైర్
హైదరాబాద్, వెలుగు: మై హోం గ్రూప్‌నకు బీఆర్ఎస్ హయాంలోనే సెంట్రల్ యూనివర్సిటీ భూములు అప్పగించారనే ఆరోపణ మిలీనియం జోక్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ‘‘కాంగ్రెస్ నేతల ఆరోపణలు నిజమే అనుకుంటే మై హోం గ్రూప్పైకి బుల్డోజర్లు పంపే దమ్ము సీఎంకు ఉందా? మై హోం గ్రూప్ చైర్మన్ బీజేపీతో ఉన్నారు. ఆయన ప్రధాని పక్కన కూర్చుంటారు. చేతనైతే అలాంటి పెద్ద వ్యక్తి మీదికి హైడ్రా బుల్డోజర్లు పంపాలి” అని సవాల్ విసిరారు.
బుధవారం హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పేదల ఇండ్లపైకి, మూగజీవాలపైకి పంపే బుల్డోజర్లు పెద్దలపైకి ఎందుకు పంపడంలేదని ప్రశ్నించారు. సెంట్రల్ వర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. సీఎం రేవంత్ చర్యలతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని, అందుకే హెచ్‌సీయూ భూములను అమ్మి సర్కారును నడపాలని నిర్ణయించారని విమర్శించారు. అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లులను కోల్డ్ స్టోరేజీకి పంపేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కారు కుట్రలు చేస్తోందన్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామాకు తెర తీశారన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని చెప్పిన సీఎం రేవంత్.. ఢిల్లీలో బీసీ సంఘాల సమావేశానికి హాజరై అఖిలపక్షం అంశాన్ని డైవర్ట్ చేశారన్నారు. బీసీ సంఘాలతో సమావేశం తర్వాత కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చామని బయటకు వచ్చి చెప్పుకోవాలన్నదే ఆయన ప్రయత్నమన్నారు. బీసీ సంఘాల ధర్నాకు ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవకుండా బీసీలను అవమానించారని ఆమె విమర్శించారు.