
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ కోదండరాం విజ్ఞప్తి చేశారు. సీతాఫల్ మండీ జీహెచ్ఎంసీ హాల్లో సోమవారం నిర్వహించిన ఉద్యమకారుల ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్, ఎల్.రమణ, నాయకులు వీహెచ్, తాడురి శ్రీనివాస్‌లు హాజరయ్యారు. జయశంకర్ ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యమకారుల ఫోరం చైర్మన్ చీమ శ్రీనివాస్, పట్లోళ్ల సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమకారులను గుర్తించి 250 గజాల ఇళ్ల స్థలంతోపాటు పెన్షన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పథకాలు వర్తింపజేయాలని, విద్యార్థి ఉద్యమకారులకు, జర్నలిస్టులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని చెప్పారు. కోదండరాం మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉద్యమకారులపై ఉందన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కార్పొరేటర్లు డాక్టర్ సామల హేమ, లింగాని ప్రసన్నలక్ష్మి, నాయకులు మల్లూరి అనిల్, గగన్‌కుమార్, జానకి రెడ్డి, దయానంద్, పుట్నాల కృష్ణ, జగన్, వీరస్వామి పాల్గొన్నారు.