
- రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కోదండరాం విజ్ఞప్తి
బషీర్బాగ్, వెలుగు: రాష్ట్రంలో ఆర్ఎంపీల నియంత్రణ అవసరమే కానీ వెంటనే నిర్మూలించడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ అవసరం అన్నారు. విద్యా కమిషన్ తరహాలో హెల్త్ కమిషన్ తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కోఠిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్డాఫీసులో ఐఎంఏ అధ్యక్షుడు ద్వారకానందరెడ్డి అధ్యక్షతన ఆదివారం‘ ప్రజా ఆరోగ్యానికి వ్యతిరేకంగా నకిలీ వైద్యం’ అనే అంశంపై చర్చావేదిక నిర్వహించారు. కోదండరాం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
చాలా మంది ఆర్ఎంపీలు అవగాహన లేకుండా అధిక మోతాదు మెడిసిన్ సిఫార్సు చేస్తున్నారని, అది ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స అందిస్తున్న ఆర్ఎంపీలకు శిక్షణ ఇప్పించాలని సూచించారు. అయితే ఆ ప్రతిపాదనను ఐఎంఏ డాక్టర్లు వ్యతిరేకించారు. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. నకిలీ విత్తనాలను ఏరివేసినట్లే, నకిలీ వైద్యులను ఏరివేయాలని కోరారు.