అప్పుల చిప్ప చేతిలో పెట్టి నీతులు చెప్తున్నరు... కోదండరాం

  • అప్పుల చిప్ప చేతిలో పెట్టి నీతులు చెప్తున్నరు
  • నిధుల కొరత ఉన్నా రుణమాఫీ చేస్తున్న సర్కార్​పైకి రైతులను ఉసిగొల్పుతరా?
  • కేటీఆర్.. రూల్స్​కు విరుద్ధంగా ఉన్న ఫామ్​హౌస్​ను ఎట్ల లీజుకు తీసుకున్నవ్
  • నాది కాదు.. దోస్తుదంటే నమ్మేటోళ్లు ఎవరూ లేరు
  • పదేండ్ల బీఆర్ఎస్ పాలన అంతా విధ్వంసమే
  • రాజీవ్ విగ్రహం మీద వివాదం కరెక్ట్ కాదు
  • మీడియాతో చిట్​చాట్​లో ఎమ్మెల్సీ కోదండరాం.


హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కార్ చేతిలో అప్పుల చిప్ప పెట్టిన బీఆర్ఎస్ పెద్దలు.. ఇప్పుడు నీతులు చెప్తున్నారని ఎమ్మెల్సీ కోదండరాం మండిపడ్డారు. గత పదేండ్ల పాలన అంతా అవినీతి, దోపిడీమయంగా సాగిందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా ఇప్పుడు.. సత్య హరిశ్చంద్రుల్లా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నిధులు కొరత ఉన్నప్పటికీ రుణమాఫీ చేస్తున్న సర్కార్​పై రైతులను ఉసి గొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడ్డు తగులుతున్నరని విమర్శించారు.

గురువారం హైదరాబాద్​లోని ఓ హోటల్​లో ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ అధికారంలో వచ్చిన తొమ్మిది నెలల్లోనే రుణమాఫీ చేయడం అభినందనీయం. ఆరు గ్యారంటీలు, పెండింగ్ డీఏలు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ.. ముందుగా రైతులను రుణ విముక్తులను చేసింది. రుణమాఫీ పూర్తయ్యే నాటికి మొత్తం రూ.31వేల కోట్లు ఖర్చు అవుతయ్.

రేషన్ కార్డులు లేనివారికి, టెక్నికల్ సమస్యల కారణంగా కొందరికి రుణమాఫీ కాలేదు’’అని కోదండరాం అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన బీఆర్ఎస్ లీడర్లే.. ఇప్పుడు రుణమాఫీపై మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. ‘‘12 లక్షల కుటుంబాలు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే.. గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్కరికి కూడా ఇయ్యలే. రుణమాఫీతో రైతులంతా సంతోషంగా ఉన్నరు. కొత్త లోన్లు తీసుకుని వ్యవసాయం చేస్తున్నరు’’అని కోదండరాం అన్నారు.

మంత్రిగా ఉండి రూల్స్ ఉల్లంఘించినవ్

జీవో 111 పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చేస్తుండటం సంతోషంగా ఉందని కోదండరాం అన్నారు. ‘‘పదేండ్లు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. రూల్స్ విరుద్ధంగా కట్టిన ఫామ్ హౌస్ ఎట్ల లీజుకు తీసుకుంటడు? ఇప్పుడేమో ఫామ్ హౌస్ నాది కాదు.. దోస్తుదని అంటున్నడు. నువ్వు చెప్పిందల్లా నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. మంత్రి పదవిలో ఉండి రూల్స్ ఉల్లంఘించినవ్. పదేండ్లు మంత్రిగా ఉండి అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చలే? కొన్ని విషయాల్లో బీఆర్ఎస్​కు మాట్లాడే అర్హత లేదు.

ఎవరితో చర్చించి జీవో 317, జీవో 46 తీసుకొచ్చినవ్? జోన్లు, జిల్లాల విభజనలూ సక్కగా చేయలే. పదేండ్ల మీ విధ్వంసాన్ని సెట్ చేయాలంటే టైమ్ పడ్తది’’అని కోదండరాం అన్నారు. జీవో 317తో మహిళా ఉద్యోగులు ఇబ్బందులుపడ్డారని తెలిపారు. ‘‘బీసీ రిజర్వేషన్లు పెంచాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గత బీఆర్ఎస్ సర్కార్ రిజర్వేషన్లు తగ్గించి బీసీలకు అన్యాయం చేసింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తున్న. 30 ఏండ్ల నుంచి ఆ పోరాటాన్ని దగ్గరుండి చూసిన’’అని కోదండరాం అన్నారు.

ఉద్యమకారులకు గౌరవం దక్కింది

సెక్రటేరియెట్​లో రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై వివాదం సరికాదని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ‘‘భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేవాళ్లు కాళోజీ, మహాత్మా గాంధీ, చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టుకోవచ్చు. ప్రధానిగా రాజీవ్ గాంధీ దేశానికి సేవ చేశారు. విగ్రహాల ఏర్పాటు విషయమై గైడ్​లైన్స్ ఖరారుకు సూచనలివ్వండి. అంతేగానీ.. గొడవ చేయకండి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని సర్కార్ ప్రకటించింది’’అని కోదండరాం అన్నారు.

కాంగ్రెస్ హయాంలోనే ఉద్యమకారులకు గౌరవం దక్కిందని తెలిపారు. ‘‘నాకు ఎమ్మెల్సీ పదవి రావడంతో ప్రజలు కూడా సంతోషంగా ఉన్నరు. పొత్తులు ఉండటంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. నిత్యం ప్రజల మధ్యే ఉంటాను. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాను’’అని కోదండరాం అన్నారు.

త్వరలో గవర్నర్​ను కలుస్త

ప్రభుత్వానికి ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉందని కోదండరాం అన్నారు. ‘‘ఎమ్మెల్సీతో బాధ్యత మరింత పెరిగింది. త్వరలో గవర్నర్​ను కలిసి థ్యాంక్స్ చెప్తా. కేబినెట్ బెర్త్ అనేది ఊహాజనితమైన అంశం. ఇప్పటి దాకా అలాంటి చర్చ జరగలేదు. ఎంతో మంది నన్ను వచ్చి కలుస్తున్నరు. సమస్యలు చెప్పుకుంటున్నరు. బయటి ఉండి సమస్యలపై పోరాడటం ఈజీ.

ప్రభుత్వంలో ఉండి సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్లడం అగ్ని పరీక్ష. యూనివర్సిటీ పదవుల్లో అన్ని సామాజిక వర్గాల వారికి ప్రభుత్వం న్యాయం చేస్తది. త్వరలోనే వీసీ పోస్టులను భర్తీ చేస్తది. నేను కూడా ప్రభుత్వాన్ని కోరుత. మెడికల్ అడ్మిషన్ల స్థానికతలో కూడా ఇబ్బందులు ఉన్నయని మేధావులు నా దృష్టికి తీసుకొచ్చిన్రు. నేను సర్కార్ దృష్టికి తీసుకెళ్త’’అని కోదండరాం అన్నారు.