పర్యావరణ పరిరక్షణకు తొలి ప్రాధాన్యమివ్వాలి : ఎమ్మెల్సీ కోదండరాం

పర్యావరణ పరిరక్షణకు తొలి ప్రాధాన్యమివ్వాలి : ఎమ్మెల్సీ కోదండరాం
  • హెచ్ సీయూ స్టూడెంట్స్ పై లాఠీచార్జ్ కరెక్ట్ కాదు: ఎమ్మెల్సీ కోదండరాం
  • విద్యార్థులపై కేసులను ఎత్తివేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: భూముల రక్షణ, పర్యావరణ పరిరక్షణ రెండు వేర్వేరు అంశాలని, ఈ రెండింటిని కలిపేయడం వల్లే సమస్యలు వచ్చాయని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. పర్యావరణ పరిరక్షణకు తొలి ప్రాధాన్యం ఉండాలని.. భూముల రక్షణను దాని నుంచి వేరుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కంచ గచ్చిబౌలి, దామగుండం విషయాల్లోనూ ఇదే జరిగిందని, ఇలాంటి భిన్నమైన అంశాలను కలిపివేయడం వల్ల ప్రజలకు అనవసరమైన సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. గురువారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు అవసరమని ఆయన పేర్కొన్నారు. 

ఆందోళనలపై నిషేధ విధించడం మంచి పద్ధతి కాదని, భూములను రక్షించాలని ఆందోళన చేస్తున్న హెచ్​సీయూ విద్యార్థులపై లాఠీచార్జ్​ జరిపిన తీరును కోదండరాం తీవ్రంగా ఖండించారు. ఇది సరైన చర్య కాదని, విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌‌ చేశారు. విద్యార్థుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. మరోసారి అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలు కంటున్నారని.. కానీ, రాష్ట్ర ప్రజలు గత పాలనలో ఎదుర్కొన్న అనుభవాలతో చైతన్యవంతులయ్యారని వ్యాఖ్యానించారు. కేటీఆర్.. కలలో ఉండి మాట్లాడుతున్నారని, ప్రజల నాడిని సరిగ్గా గ్రహించాల్సిన అవసరం ఉందని సూచించారు. 

7న డీలిమిటేషన్‌‌పై సెమినార్

ఈ నెల 7న డీలిమిటేషన్‌‌పై సెమినార్ ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. ఈ సమావేశానికి తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ  నాయకుడు తిరుమవళన్‌‌తో పాటు మరికొందరు ప్రముఖ నేతలు హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల పట్ల జరుగుతున్న అన్యాయంపై సీరియస్ చర్చ జరగాల్సిన అవసరం ఉందని, అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందజేస్తామన్నారు. సెమినార్‌‌ కు అన్ని రాజకీయ పార్టీల నేతలు, నిపుణులు హాజరు కావాలని, ఈ చర్చను విజయవంతం చేయాలని కోదండరాం కోరారు.