బూర్గంపహాడ్, వెలుగు: పోడు భూములు సాగు చేసే రైతులకు రైతు భరోసా అందించడంతో పాటు ఉపాధి హామీ జాబ్ కార్డు లేని పేద రైతులకు రైతు ఆత్మీయ భరోసా పథకం అమలు చేసేలా సీఎం రేవంత్ రెడ్దితో మాట్లాడతానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. మంగళవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు కాలువల ద్వారా అశ్వాపురం, బూర్గంపహాడ్ మండలాల రైతులకు సాగు నీటిని అందించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు..
ఖమ్మం, కొత్తగూడెం జిల్లా రహదారులపై ప్రమాదాలను అరికట్టేందుకు హైవేలను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో బూర్గంపహాడ్, భద్రాచలం, అశ్వాపురం మండలాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు మారం వెంకటేశ్వర రెడ్ది, సిద్దులు, టీజేఎస్ నాయకులు నబీ సాబ్, కరుణాకర్ రెడ్ది, వెంకటేశ్ రెడ్ది, మూల నాగిరెడ్ది పాల్గొన్నారు.