తొర్రూరు (పెద్దవంగర), వెలుగు : గ్రామాల్లో భూ సమస్యలు లేకుండా చూడాడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామంలో గురువారం నిర్వహించిన ‘భూ న్యాయ శిబిరం’ కార్యక్రమానికి నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌తో పాటు కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ భూ సమస్యల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూమి హక్కుల పరీక్ష చేసుకోవడం రైతులు అలవాటు చేసుకోవాలని, ఈ పద్ధతి కొత్తగా ఉన్నా తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రతి మనిషి తన ఆరోగ్యం గురించి ఎలాగైతే వైద్య పరీక్షలు చేయించుకుంటాడో.. భూమి పరీక్ష కూడా అలాంటిదేనన్నారు. భూ సమస్య ఎలాంటిదో తెలిస్తేనే పరిష్కారం వెతకడం ఈజీ అవుతుందని, అందుకే తాము భూ న్యాయ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులకు ఉచితంగా భూమి హక్కుల పరీక్ష చేసి రిపోర్ట్‌ను అందజేస్తున్నామని చెప్పారు. లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి శనివారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నిర్వహించే కార్యక్రమానికి రైతులు ఎవరైనా ఫోన్ చేసి న్యాయ సలహాలు తీసుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో లీఫ్ సంస్థ సలహాదారుడు కరుణాకర్ దేశాయ్, ఉపాధ్యక్షుడు జీవన్‌రెడ్డి, అడ్వకేట్లు మల్లేశం, ప్రవీణ్, శ్రీకాంత్, తహసీల్దార్ మహేందర్ పాల్గొన్నారు.