ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల ఫీజులపై నియంత్రణ ఉండాలి : ఎమ్మెల్సీ కోదండరాం

ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్ల ఫీజులపై నియంత్రణ ఉండాలి : ఎమ్మెల్సీ కోదండరాం
  • పీవైఎల్, పీవోడబ్ల్యూ చర్చా వేదికలో ఎమ్మెల్సీ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్ల ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. దాని కోసం కమిటీ వేసి సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని కోరారు. శుక్రవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీవైఎల్, పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో ‘ప్రైవేట్ హాస్పిటల్స్ ఫీజులు, ప్రభుత్వ దవాఖానల బలోపేతం’ అనే అంశంపై కేఎస్ ప్రదీప్, డి స్వరూప అధ్యక్షతన చర్చా వేదిక నిర్వహించారు.

దీనికి కోదండరాం హాజరై మాట్లాడారు. గవర్నమెంట్​ హాస్పిటళ్లు, హోటళ్లు అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయని, అక్కడికి వెళ్తే రోగాలు వచ్చేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న హోటల్స్​ నుంచి మొదలుపెడితే పెద్ద స్టార్​ హోటల్స్​ వరకు ఎక్కడ ఫుడ్​ తినాలన్నా జనం భయపడుతున్నారని, ఈ మధ్య ఫుడ్​సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో అలాంటి దృశ్యాలు బయటపడుతున్నాయన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం విద్య కోసం బడ్జెట్​లో 20 శాతం నిధులు, వైద్యం మీద 15 శాతం నిధులు ఖర్చు చేస్తోందని కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ వైపు అడుగులు వేయాలని కోరారు. సర్కారు హాస్పిటల్స్ కి నిధులు కేటాయించి బలోపేతం చేస్తేనే సామాన్యులకు వైద్యం అందుతుందన్నారు. గత ప్రభుత్వం కూలిపోయే ప్రాజెక్టుకు వేలకోట్ల కేటాయించి, విద్య, వైద్యాన్ని గాలికి వదిలేసిందని విమర్శించారు. ఈ చర్చా వేదికలో హైదరాబాద్ డీఎంహెచ్​వో జుమ్మిడి వెంకటి, కేస్ ప్రదీప్, వి అజయ్, స్వరూప, శిరోమణి, ఎం హన్వేష్, ఎస్ ఎల్ పద్మ, కోట రమేశ్ పాల్గొన్నారు.