
రెండో రాజధానిగా హైదరాబాద్ ను ఒప్పుకునేది లేదన్నారు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం.హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేస్తే ఢిల్లి పరిస్థితి రావొచ్చు.. అందుకే రెండో రాజధానికి వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు కోదండరాం. సుప్రీం కోర్టు బెంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి..పార్లమెంట్ ఒక సెషన్ సమావేశాలు ఇక్కడి పెట్టాలని అన్నారు.
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన్ భవన్ లో మాట్లాడిన కోదండరాం.. విదేశీ కంపెనీలు వస్తే ఒక్క గుజరాత్, మహారాష్ట్రలకే కాకుండా అన్ని రాష్ట్రాలకు రావాలి. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాలి. ఉత్తర భారత్ తో పోలిస్తే .. దక్షిణ భారత్ లో జనాభా తక్కువ. జనాభా ఆధారంగా నియోజక వర్గాల పునర్ వ్యవస్థీకరణ చేయనున్నారు. దీని వల్ల పార్లమెంట్ లో ఉత్తర భారత్ నుంచి ప్రాతినిధ్యం పెరిగి... దక్షిణ భారత్ ప్రభావం తగ్గుతుంది. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిటి ప్రతిపాదనల్లో లోపాలు ఉన్నాయని అంబేద్కర్ చెప్పారు. ఒక భాష మాట్లాడే వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉండాలి.. కానీ ఒక భాష మాట్లాడే వాళ్ళందరినీ తెచ్చి ఒక రాష్ట్రంగా చేస్తామంటే సరికాదు. దక్షిణ భారత్ నుంచి డిల్లీకి వెళ్ళాలంటే చాలా కష్టం. దక్షిణ భారత్ ను పట్టించుకోవడం లేదని అంబేద్కర్ చెప్పారు. ఇప్పుడు ఇదే పరిస్థితి దేశంలో కనిపిస్తోంది.
Also Read :- లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్
జలాశయాలను కేంద్రం కంట్రోల్ చేస్తోంది. ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నారు. దక్షిణ భారత్ లోని రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపిస్తున్నారు. కేంద్రం తనకు కావాల్సిన వాళ్లకు అన్ని వడ్డిస్తూ మనల్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని అంబేద్కర్ చెప్పారు. బలవంతంగా హిందీ రుద్దడంపై హిందియేతర రాష్ట్రాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. కేంద్రం అధికారం ఉందని బలవంతంగా హిందీనీ రుద్దే అవసరం లేదు. అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు, న్యాయమైన వాటాలు దక్కాలి అని కోదండరాం అన్నారు.