
ఖమ్మం టౌన్/ కూసుమంచి/ కారేపల్లి, వెలుగు: మున్నేరువరద బాధితులకు ఎంత సాయం చేసినా తక్కువేనని, నిరాశ్రయులైన ప్రజల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. గురువారం ఖమ్మం సిటీలో మున్నేరు ముంపు ప్రాంతాల నయాబజార్ కాలేజ్ ను సందర్శించి వరద బాధితులను పరామర్శించారు. జరిగిన నష్టాన్ని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత నయాబజార్ స్కూల్ ప్రాంగణంలో జన సమితి, హాజరత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం బొక్కల గడ్డ, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాలలో పర్యటించి బాధితుల కష్టాలను ప్రత్యక్షంగా చూశారు.
స్కూల్ లో విద్యార్థుల సర్టిఫికెట్స్,తడిసిన బుక్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు తక్షణ సాయంతో పాటు మనోధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తెలంగాణ జన సమితి ఖమ్మం జిల్లా ఇన్ చార్జ్ శంకర్రావు, జిల్లా కన్వీనర్ బాబు, టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు రంగరాజు, ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్, బైరి రమేష్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నరసయ్య, ఖమ్మం మిత్రులు సీహెచ్ వీరారెడ్డి, జైపాల్ రెడ్డి, కే. వెంకటేశ్వర్లు, సురేష్, కృష్ణవేణి ఉన్నారు.
ప్రభుత్వ శాఖలను భ్రష్టు పట్టించిన గత ప్రభుత్వం
ఖమ్మం రూరల్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ శాఖలను భ్రష్టు పట్టించిందని, అందులో రెవెన్యూ శాఖ అగ్రభాగాన ఉందని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. వరద బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం వచ్చిన ఆయనకు గరికె ఉపేందర్, సయ్యద్ షౌకత్ అలీ, నందగిరి శ్రీనివాసరావు నేతృత్వంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి కోదాడ క్రాస్ రోడ్డు వద్ద ఘన స్వాగతం పలికారు.
వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్రశాఖ పక్షాన సమర్పించిన విజ్ఞాపన పత్రంపై స్పందిస్తూ, రెవెన్యూ శాఖ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం లాంటిదని, అలాంటి శాఖను గత పాలకులు తమ స్వార్థ ,సంకుచిత ,ప్రయోజనాల కోసం వీఆర్వో వ్యవస్థను తొలగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని పేర్కొన్నారు. వీఆర్వోలకు న్యాయం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. విద్యాశాఖకు అత్యంత ప్రాధాన్యత కల్పించి, బలోపేతం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. టీఎన్జీఓ నేతలు ఆర్వీఆర్ సాగర్, శ్రీను, సీపీఎస్ నేత శశిధర్, టీజీఓ మాజీ అధ్యక్షుడు ఖాజామియా, వజ్జ రామారావు, రాజారత్నం, వి వెంకన్న, బంకా భాస్కర్, ఎన్ రామకృష్ణ, వస్రాం తదితరులు ఉన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
భారీ వర్షాలకు వాగులో గల్లంతై మృతిచెందిన కుసుమంచి మండలానికి చెందిన షేక్, యాకూబ్,సైదాబీ కుటుంబాన్ని కోదండరాం పరామర్శించారు. అనంతరం ఆకేరు వరద ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందిన అశ్విని కుటుంబాన్ని గంగారం తండాలో పరామర్శించారు. సైంటిస్ట్ అశ్విని, తండ్రి మోతిలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అశ్విని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని దానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని తెలిపారు.