![టీచర్ల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి : రఘోత్తం రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/mlc-kur-raghottam-reddy-urges-government-to-address-teachers-problems_pbQPOLJXxI.jpg)
- ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి
సిద్దిపేట టౌన్, వెలుగు: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి కోరారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. టీఎస్ యూటీఎఫ్, టీఎస్ఎస్ టీయూ, తెలంగాణ ప్రాంత పీఆర్టీయూ జేఏసీలతో పాటు జూనియర్, డిగ్రీ, యూనివర్సిటీల అధ్యాపకుల మద్దతు తమకే ఉందన్నారు.
స్వతంత్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కొంతమంది కార్పొరేట్ శక్తులు డబ్బుతో మండలిలో అడుగుపెడదామని చూస్తున్నారని, శాసనమండలిలోకి కార్పొరేట్ శక్తులు సభ్యులుగా వెళితే ప్రభుత్వ ఉపాధ్యాయుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కొంతమంది ప్రైవేటు ఉపాధ్యాయులు ఓల్డ్ మేనేజ్మెంట్ ద్వారా డబ్బులు వెదజల్లి పది, పదిహేను వేల ఓట్లను కొనాలని చూస్తున్నారని, దీన్ని విజ్ఞులైన ఉపాధ్యాయులు గుర్తించాలని కోరారు. ఈనెల 27న జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో తమ మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పట్నం భూపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, నాయకులు యాదగిరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.