హైదరాబాద్, వెలుగు: ఏడాదిగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బిల్లులు వెంటనే చెల్లించాలని టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. నెలల తరబడి బిల్లులు రిలీజ్ కాకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో పీఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్ పింగిలి శ్రీపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆ సంఘం రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో రఘోత్తం చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. టీచర్ల ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేయించిన ఘనత పీఆర్టీయూదేనని, టీచర్లు, ఉద్యోగులకు పూర్తి నగదు రహిత చికిత్స అందేలా హెల్త్ స్కీమ్ రూపొందిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడం కూడా పీఆర్టీయూ సాధించిన విజయమని ఆయన గుర్తుచేశారు.
త్వరలోనే తెలంగాణ రెండో పీఆర్సీ కూడా మంచి ఫిట్మెంట్ సాధించి టీచర్లకు కానుకగా అందిస్తామన్నారు. ప్రస్తుతం ఆగిపోయిన టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగేలా సంఘం ప్రయత్నం చేస్తుందన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు మాట్లాడుతూ టీచర్ల సమస్యల పరిష్కారానికి పలు తీర్మానాలు చేశామని వివరించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎంటీఎస్ అమలు చేయాలని, గురుకుల టీచర్లకు 010 ద్వారా వేతనాలు, హెల్త్ కార్డులు అందించాలని, బడుల్లో స్కావెంజర్లను నియమించాలని, సీపీఎస్ విధానం రద్దు చేయాలంటూ పలు తీర్మానాలు చేశారు. ఎమ్మెల్సీ పూల రవీందర్, చెన్నకేశవరెడ్డి, ఇన్నారెడ్డి, మనోహర్, చిత్తలూరి ప్రసాద్, గీత, త్రివేణి, విజయ, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.