ముషీరాబాద్, వెలుగు : తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలనుప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. స్టేట్ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ కొండయ్య అధ్యక్షతన బుధవారం ఇందిరా పార్క్ ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి హాజరై మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2013 నుంచి టీచర్లు ఒకే స్కూల్‌లో పనిచేస్తున్నారని, వెంటనే ట్రాన్స్‌ఫర్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇటీవల ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించిన ప్రభుత్వం మోడల్ స్కూళ్లను విస్మరించిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 4 వేల మంది టీచర్లను బదిలీ చేయాలని, వారికి 010 పద్దు కింద జీతాలు చెల్లించి హెల్త్‌కార్డులు, మెడికల్ రీయింబర్సమెంట్ సదుపాయం కల్పించాలని కోరారు. ధర్నాలో జంగయ్య, చావ రవి, ఎస్. మహేశ్, రాధాకృష్ణ, సురేశ్, అశోక్, వెంకటేశ్, క్రాంతికుమార్, నాగరాజు, మోహన్‌రావు, శ్వేత, అనసూయ పాల్గొన్నారు.