టీచర్లు, ప్రజలు కలిసి సర్కారు బడులను నిలబెట్టుకోవాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

​ నేలకొండపల్లి, వెలుగు :  రాష్ట్రంలో సర్కారు బడులను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత టీచర్లు, ప్రజలదేనని టీచర్​ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో  తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ విస్తృత స్థాయీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను నిలబెట్టుకోవడం ద్వారానే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, ఫెడరల్ విధానాలను నిలుపుకోగలుగుతామని చెప్పారు.

రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఒకే సంఖ్యలో స్కూళ్లు, స్టూడెంట్లు లేరని, విద్యార్థుల సంఖ్య, స్కూళ్ల సంఖ్యకు అనుగుణంగా విద్యా జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పాఠశాల పర్యవేక్షణ అధికారుల పోస్టులు 80 శాతం పైన ఖాళీగా ఉన్నాయని, వాటిని, టీచర్​ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న పాలకులు, రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ, మతాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టెట్ నుంచి మినహాయింపు నిచ్చి టీచర్ల ప్రమోషన్లు చేపట్టాలని, అప్ గ్రేడేషన్ పూర్తిచేసి పండిట్, పీఈటీలకు ప్రమోషన్ ఇవ్వాలని, ఖమ్మం జిల్లాలో ఉన్న కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలకు టీచర్​ పోస్టులు మంజూరు చేయాలని కోరారు.

కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చావ రవి, యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా దుర్గా భవానీ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జీవీ నాగమల్లేశ్వరరావు, పారుపల్లి నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రి వెంకన్న, షేక్ షమీ, జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.