- పాలేరు సీటు వదులుకోవాలని సూచన?
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ కావడానికి కారణమేంటి ? పాలేరులో ఓడిపోయిన తర్వాత నాలుగేళ్ల నుంచి పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న ఆయన రీసెంట్ గా ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ముందు చురుగ్గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రీజనేంటి? వచ్చే ఎన్నికల్లో మళ్లీ పాలేరు స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న తుమ్మలకు పార్టీ హైకమాండ్ నుంచి వచ్చిన సందేశమేంటి? పార్టీ టికెట్ పై అధినేత నుంచి హామీదక్కిందా.. మళ్లీ కేబినెట్ లోకి తుమ్మలను తీసుకునే ఛాన్సుందా..? ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాలపై మెల్లగా క్లారిటీ వస్తోంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ సూచన మేరకు మంత్రి హరీశ్ రావు రాయబారం చేయడంతో ఇన్నేళ్లు సైలెంట్ గా ఉన్న తుమ్మల యాక్టివ్ అయ్యారు. అయితే కోరుకున్న విధంగా పాలేరు టికెట్ పై తుమ్మలకు ఎలాంటి హామీ దక్కలేదని, కేబినెట్ బెర్త్ పై కూడా క్లారిటీ లేదని సమాచారం. వచ్చే నెలలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీటు తుమ్మలకు ఇచ్చి, వచ్చే ఎన్నికల్లో పాలేరు సీటు కందాలకు కేటాయించేలా రాజీమార్గాన్ని హరీశ్ ద్వారా కేసీఆర్ ప్రతిపాదించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఓకే.. మంత్రి పదవిపై సస్పెన్స్
ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు దాదాపు 10 రోజుల ముందు ఆ పార్టీ ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు గండుగులపల్లిలోని తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. పార్టీ అధినేత నుంచి తెచ్చిన కబురు చెప్పారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ కావాలని కేసీఆర్ చెప్పారంటూ తుమ్మలకు వివరించారు. త్వరలోనే ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం నుంచి అవకాశం కల్పిస్తామంటూ కేసీఆర్ మాటగా చెప్పినట్టు సమాచారం. అయితే కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యే ఏర్పాటు చేయాలని హరీశ్‌ను తుమ్మల కోరినట్టు తెలుస్తోంది. బహిరంగ సభ ముగిసిన తర్వాత కేసీఆర్ తో చర్చించి మీటింగ్ ఏర్పాటు చేయిస్తానని హరీశ్మాట ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కసారి కేసీఆర్‌తో ముఖాముఖి సమావేశం అయితే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో పాలేరు టికెట్ తనకు వచ్చేలా అధినేతను ఒప్పించవచ్చన్న ఆలోచనలో తుమ్మల ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ మామ కర్మకాండల్లో, ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ప్రారంభం, ఖమ్మం బహిరంగ సభ వేదికపై కేసీఆర్‌ను కలిసే అవకాశం వచ్చినా, ప్రత్యేకంగా మాట్లాడే ఛాన్స్ రాలేదు. దీంతో పార్టీ ఆదేశానుసారం ప్రస్తుతం తుమ్మల యాక్టివ్‌గా మారినా, ఆయన కోరుకున్న విధంగా పాలేరు టికెట్ పై హామీ మాత్రం ఇంకా దక్కలేదని తెలుస్తోంది. అదే సమయంలో మళ్లీ మంత్రివర్గంలోకి తుమ్మలను తీసుకుంటారంటూ జరుగుతున్న ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం జిల్లా నుంచి ఇప్పటికే అజయ్ కేబినెట్ లో ఉండగా, మళ్లీ అదే సామాజికవర్గానికి చెందిన తుమ్మలకు ఛాన్స్ తక్కువగా ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కందాలకు టికెట్ పక్కా
2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి అప్పటి టీఆర్ఎస్లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కందాల ఉపేందర్ రెడ్డి ఒకరు. ఎమ్మెల్యేగా ఎన్నికైంది మొదటిసారే అయినా, తనదైన తీరుతో నియోజకవర్గంలో అభిమానులను సంపాదించుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 వేల సాయంతో పాటు అందరికీ అందుబాటులో ఉంటారని పేరు తెచ్చుకున్నారు. ఇక సిట్టింగులకు సీటు కన్ఫామ్ అని పార్టీ నేతల సమావేశంలో కేసీఆర్ స్పష్టంచేయడంతో పాలేరు సీటుపై ధీమాగా ఉన్నారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇటీవల జిల్లాలో పర్యటించిన సమయంలో ‘వచ్చే ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి విజయాన్ని ఎవరూ ఆపలేరు’ అంటూ కామెంట్ చేయడం కూడా కందాలకు టికెట్ ఖాయమన్న భావన వచ్చింది. ఇంతలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పు ఆలోచనలు, ఇతరత్రా అంశాల కారణంగా తుమ్మలను మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దగ్గరకు తీయాల్సిన పరిస్థితులుకల్పించాయన్న అభిప్రాయాలున్నాయి. అయితే మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఎక్కడి నుంచి ఎలా కల్పిస్తారు, ఎమ్మెల్సీ, మంత్రి పదవి అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం అవుతుందనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది.